ఈ నెల 26 తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన నేపథ్యంలో పెద్దగా కనిపించే చంద్రుడు భూమికి చాలా సమీపం నుండి వెళ్తున్నట్టు ఉండే ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ ఘటన రష్యా మరియు కెనడా మధ్య ప్రాంతంలో జరిగిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రష్యా మరియు కెనడా మధ్య ప్రాంతంలో భూమికి సమీపంలో పెద్దగా కనిపించిన చంద్రుడి వీడియో.
ఫాక్ట్ (నిజం): ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేయబడిన వీడియో. ఒక టిక్ టాక్ యూసర్ దినిని క్రియేట్ చేసి తన అకౌంట్ లో షేర్ చేసాడు, ఇలాంటి మరికొన్ని వీడియోలు కూడా తన అకౌంట్ లో షేర్ చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పెద్ద ఆకారంలో భూమికి సమీపం నుండి వెళ్తున్నట్టు ఉన్న ఈ వీడియో నిజానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసింది. Aleksey__nz అనే టిక్ టాక్ యూసర్ ఈ వీడియోని క్రియేట్ చేసాడు.
తన టిక్ టాక్ అకౌంట్ లో ఇలాంటివే మరికొన్ని వీడియోలు షేర్ చేసాడు. తను ఒక కంప్యూటర్ గ్రాఫిక్ క్రియేటర్ అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పేర్కొన్నాడు. Hoax eye అనే మరొక ఫాక్ట్ చెకెర్ ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. ఈ వీడియో నిజం కాదని, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ అని స్పష్టం చేసిన ఒక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.
అంతే కాకుండా కేవలం ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ అని నిర్దారించవచ్చు. ఎలాగంటే సాధారణంగా భూమి-చంద్రుడి మధ్య సరాసరి దూరం 3,84,440 కిలోమీటర్లు. భూమి చుట్టూ తిరుగుతూ భూమికి సమీపంలోకి చేరుకునే పాయింట్ ని ‘పెరిజీ’ అంటారు. ఈ పాయింట్ వద్ద భూమి-చంద్రుడి మధ్య దూరం 3,56,509 కిలోమీటర్లు. ఐతే ఈ దూరం వద్ద నుండి సూర్యుడు ప్రకాశిస్తున్న సమయంలో చంద్రుడు వీడియోలో చూపించినంత ప్రకాశవంతంగా కనిపించడు. పైగా వీడియోలో చంద్రుడు భూమి దగ్గరి నుండి వెళ్తున్నప్పుడు కింద ఉన్న నీటిలో ఎటువంటి ప్రతిబింబం కనిపించదు.
సాధారణంగా టైడల్ లాకింగ్ కారణంగా భూమి నుండి ఎల్లపుడూ కేవలం చంద్రుడి ఒక వైపే కనిపిస్తుంది, రెండో వైపు భాగం మనకు కనిపించదు. కాని పోస్టులోని వీడియోలో భూమి సమీపం నుండి వెళ్తున్నప్పుడు చంద్రుడి రండో వైపు కూడా కనిపిస్తుంది. దీన్నిబట్టి కూడా ఈ వీడియో నిజం కాదని అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, భూమికి సమీపం నుండి చంద్రుడు వెళ్తున్న ఈ వీడియో నిజం కాదు, దినిని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసారు.