Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియో క్లిప్పులను జోడిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ తరువాత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్‌ కలిసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయిన తరువాత చంద్రబాబుని జూనియర్ ఎన్టీఆర్‌ కలుసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరైన తరువాత చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్‌ కలుసుకున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2023 జనవరి నెలలో గుండె పోటుకు గురై చికిత్స పొందుతున్న తారకరత్నను కలుసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రికి వెళ్ళిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న చంద్రబాబు, బాలకృష్ణ మరియు లోకేష్ దృశ్యాలు కూడా తారకరత్న నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసినవి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ చంద్రబాబుని కలుసుకున్నట్టు ఇటీవల ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన వీడియోలని స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని పలు యూట్యూబ్ ఛానెల్‌లు 2023 జనవరి నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. గుండె పోటుకు గురై చికిత్స పొందుతున్న తారకరత్నను కలుసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రికి చేరుకున్న దృశ్యాలంటూ ఈ వీడియోలను షేర్ చేస్తూ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌ తారకరత్నను కలుసుకునేందుకు నారాయణ హృదయాలయా ఆసుపత్రికి వెళ్ళిన విషయాన్ని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఆ పాత వార్తా రిపోర్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

2023 జనవరి నెలలో నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు మీడియాకు వివారిస్తున్న పాత దృశ్యాలను మరొక వీడియో క్లిప్పు చూపిస్తుంది.

అలాగే, వీడియోలో కనిపిస్తున్న మరికొన్ని దృశ్యాలు కూడా నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో  తారకరత్నను చూసేందుకు బాలకృష్ణ మరియు నారా లోకేష్ వెళ్ళినప్పుడు తీసినవి. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్పులు అన్నీ పాతవి అని స్పష్టమయ్యింది.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్‌ కలుసుకున్న ఇటీవల దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll