మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ 21 నవంబర్ 2024 (ఇక్కడ , ఇక్కడ) అమృత్‌సర్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన తన భార్య నవజోత్ కౌర్ స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నుండి పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం తీసుకోవడం వలన, ఉపవాసం (intermittent fasting) చేయడం వలన ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, “నా భార్య స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతోంది, ఇక బతకడానికి 3% మాత్రమే అవకాశం ఉంది అని డాక్టర్లు తేల్చి చెప్పారు,అలాంటిది సనాతన వైద్య చిట్కాలైన ఉపవాసం, వేప ఆకు, పసుపుతో 40 రోజుల్లో క్యాన్సర్ నయం చేశాం అని నవజ్యోత్ సింగ్ సిద్ధు పేర్కన్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పసుపు, వేప ఆకులు, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం మరియు ఉపవాసం (intermittent fasting) నా భార్య నవజోత్ కౌర్ స్టేజ్-4 క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకునేలా చేసాయి – నవజ్యోత్ సింగ్ సిద్ధూ.
ఫాక్ట్(నిజం): వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం మరియు ఉపవాసం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు లేదా క్యాన్సర్ తగించవచ్చు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మీడియా సమావేశంలో వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన డైట్ గురించి సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, పలువురు వైద్యలు మరియు ఆరోగ్య నిపుణులు దీనిపై స్పందిస్తూ, ఈ డైట్ వల్లే నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ నుండి కోలుకున్నారని అనే వాదన సరైనది కాదని అటువంటి వాదనలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో సిద్ధూ కూడా, సర్జరీలు, కీమోథెరపీ, హార్మోనల్ మరియు టార్గెటెడ్ థెరపీ, కఠినమైన డైట్ ప్లాన్ మరియు వ్యాధితో పోరాడాలనే తన భార్య దృఢ సంకల్పం వంటి అనేక అంశాలు తన భార్య క్యాన్సర్ నుండి కోలుకోవడానికి దోహదపడ్డాయని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
21 నవంబర్ 2024న, నవజ్యోత్ సింగ్ సిద్ధూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా తన భార్య నవజ్యోత్ కౌర్ కేవలం 40 రోజుల్లోనే 4వ దశ క్యాన్సర్‌ను అధిగమించారని, ఇది వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్లన మరియు ఉపవాసం (intermittent fasting) చేయడం ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను తీసుకుందని చెప్పారు. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకున్నారని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు , బెల్లం, యాలకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో క్యాన్సర్‌ను ఎలా జయించవచ్చో చెప్పేందుకు ఈ సంఘటన మంచి ఉదాహరణ అని సిద్ధూ పేర్కొన్నారు.
అయితే, అదే విలేకరుల సమావేశంలో సిద్ధూ తన భార్య కాన్సర్ చికిత్స యొక్క మొత్తం ప్రయాణాన్ని కూడా పంచుకున్నాడు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు చికిత్స అందించడంలో వైద్య వ్యవస్థ మరియు అందుబాటులో ఉన్న వైద్య చికిత్సల యొక్క ముఖ్య పాత్రను కూడా ఆయన చెప్పారు. నవజ్యోత్ కౌర్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మరియు ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు పాటించారని, అలాగే ఆమె ప్రభుత్వ ఆసుపత్రులతో సహా పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నారని, పలు సర్జరీలు మరియు కీమోథెరపీ కూడా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశం యొక్క పూర్తి వీడియోను ఇక్కడ చూడవచ్చు (ఆర్కైవ్ చేసిన లింక్).
ఈ విలేకరుల సమావేశం తర్వాత, పలు మీడియా (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సంస్థలు సిద్ధూ పేర్కొన్న డైట్‌ను హైలైట్ చేస్తూ కథనాలను ప్రచురించాయి. ఈ కథనాలు అన్ని నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ ఈ డైట్ పాటిచడం ద్వారా కేవలం 40 రోజుల్లో స్టేజ్ 4 క్యాన్సర్‌ను అధిగమించారని సిద్ధూ పత్రిక సమావేశంలో ప్రకటించినట్లు పేర్కొన్నాయి. ఈ డైట్ గురించి సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, పలువురు వైద్యు నిపుణులు మరియు వైద్య సంఘాలు స్పందిస్తూ కేవలం ఈ డైట్ వల్లే నవజ్యోత్ కౌర్ కాన్సర్ నుండి కోలుకున్నారని అనే వాదన సరైనది కాదని పేర్కొన్నారు. దీంతో సిద్ధూ కూడా, సర్జరీలు, కీమోథెరపీ, హార్మోనల్ మరియు టార్గెటెడ్ థెరపీ, కఠినమైన డైట్ ప్లాన్ మరియు వ్యాధితో పోరాడాలనే దృఢ సంకల్పం వంటి అనేక అంశాలు తన భార్య క్యాన్సర్ నుండి కోలుకోవడానికి దోహదపడ్డాయని స్పష్టం చేశాడు (ఇక్కడ , ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఈ విలేకరుల సమావేశంలో తన భార్య నవజోత్ కౌర్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారని, ఆమె చికిత్సలో ఎక్కువ భాగం యమునానగర్‌లోని వారమ్ సింగ్ ఆసుపత్రిలో, టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో మాజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ రూపిందర్ బాత్రా పర్యవేక్షణలో జరిగిందని సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ కూడా ఒక పోస్టులో డాక్టర్ బాత్రాకు తన కృతజ్ఞతలు తెలియజేశారు (ఇక్కడ). నవజ్యోత్ కౌర్ అనేక శస్త్రచికిత్సలు మరియు కీమోథెరపీ సెషన్‌లు చేయించుకున్నారని పలు రిపోర్టులు కూడా సూచిస్తున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఆహారం మరియు జీవనశైలి మార్పుల ద్వారా తన భార్య నవజోత్ కౌర్ స్టేజ్ 4 క్యాన్సర్‌ను అధిగమించిందని సిద్ధూ మీడియా సమావేశం వీడియో వైరల్ కావడంతో, పలువురు వైద్యలు మరియు ఆరోగ్య నిపుణులు దీనిపై స్పందిస్తూ, ఈ డైట్ వల్లే నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ నుండి కోలుకున్నారని అనే వాదన సరైనది కాదని అటువంటి వాదనలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). 23 నవంబర్ 2024న, 262 మంది ఆంకాలజిస్టులతో కూడిన టాటా మెమోరియల్ హాస్పిటల్ అలుమ్ని బృందం (TMHA), ఈ డైట్ గురించి ప్రజలను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది (ఇక్కడ). ఈ ప్రకటనలో వారు, వైరల్ పోస్టులో పేర్కొన్న ఆహారం మరియు జీవనశైలి మార్పుల ద్వారా క్యాన్సర్ నయం అవుతుంది అనే వాదనకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని పేర్కొంటూ క్యాన్సర్‌తో బాధ పడే వారు సాంప్రదాయ క్యాన్సర్ చికిత్సలను ఆలస్యం చేయవద్దని వారు ప్రజలను కోరారు.
పసుపు, వేప ఆకులు, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం మరియు ఉపవాసం (intermittent fasting) క్యాన్సర్‌ను నయం చేయగలవా?
వేప ఆకు తీసుకోవడం వల్లన క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు లేదా క్యాన్సర్ తగించవచ్చు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొన్ని ప్రయోగశాల అధ్యయనాలు, రిపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), వేప పదార్దాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడం ద్వారా క్యాన్సర్ నిరోధక చర్యలను కలిగి ఉన్నాయని చూపుతున్నాయి. అయినప్పటికీ, ఇది సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్సగా చూపించే మానవుల మీద చేసిన అధ్యయనాలు లేవు.
పసుపు అనేది భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసు. ఇది ఒక రూట్ లేదా రైజోమ్ నుండి వస్తుంది, దాని ప్రధాన పదార్ధం కర్కుమిన్. పలు అధ్యయనాలు మరియు రిపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) పసుపులో ఉండే కర్కుమిన్ కొన్ని రకాల క్యాన్సర్‌లలో క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. అలాగే, కర్కుమిన్ క్యాన్సర్ వ్యాప్తిని నెమ్మదింపజేయడంలో, కీమోథెరపీ ప్రభావాన్ని పెంచడంలో మరియు రేడియేషన్ థెరపీ వల్ల కలిగే నష్టం నుండి ఆరోగ్యకరమైన కణాలను రక్షించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. అయినప్పటికీ, కేవలం పసుపు తీసుకోవడం వలన క్యాన్సర్ నయం అవుతుందని చెప్పే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ పరిశోధనలు చాలా వరకు ప్రయోగశాలలో జరిగినవే, ఇంకా దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు మరియు క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఈ అధ్యయనాలు ఏవీ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులపై పసుపు/కర్కుమిన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టం చేయలేదు.
యూనివర్శిటీ ఆఫ్ చికాగో అధ్యయనం ప్రకారం, ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడంలో సహాయపడటం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటం వంటి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే క్యాన్సర్‌ను నయం చేసే గుణాలు ఇందులో లేవు.
ఉపవాసం చేయడం వలన క్యాన్సర్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో వైద్యపరంగా అస్పష్టంగా ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాలు మరియు రిపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ) ఉపవాసం క్యాన్సర్ పాథోఫిజియాలజీపై ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. ఆహార నిపుణుడు/వైద్యుని పర్యవేక్షణలో సరిగ్గా చేస్తే, ఉపవాసం శారీరకంగా లేదా మానసికంగా క్యాన్సర్ రోగులకు ప్రమాదకరం కాదని, క్యాన్సర్ చికిత్సల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మరియు చికిత్సల ప్రయోజనాన్ని పెంచడానికి, యాంటీకాన్సర్ చికిత్సలకు ఉపవాసం జోడించబడవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
కేవలం వేప మరియు పసుపు వంటి పదార్థాలు క్యాన్సర్‌ను నయం చేయగలవు లేదా క్యాన్సర్ నుండి ఉపశమనాన్ని అందిస్తాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ, సాంప్రదాయిక వైద్య చికిత్సలకు అనుబంధంగా క్యాన్సర్ నిర్వహణలో ఈ పదార్థాలు సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇంతకు ముందు కూడా కొబ్బరినూనె, వేడి కొబ్బరి నీరు, వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అంటూ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly ఫాక్ట్-చెక్ కథనాలను పబ్లిష్ చేసింది (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, తన భార్య యొక్క స్టేజ్-4 క్యాన్సర్ కేవలం వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం మరియు ఉపవాసం ద్వారా నయమైందని సిద్ధూ వాదనలకు మద్దతు ఇచ్చే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సర్జరీలు, కీమోథెరపీ, హార్మోనల్ & టార్గెటెడ్ థెరపీలు, కఠినమైన డైట్ ప్లాన్‌లు వంటి అనేక అంశాలు తన భార్య క్యాన్సర్ నుండి కోలుకోవడానికి దోహదపడ్డాయని అతను తర్వాత వివరణ ఇచ్చాడు.