Fake News, Telugu
 

మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను పట్టించుకోకుండా మోదీ ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తున్నాడంటూ క్లిప్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిన సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఐతే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రాష్ట్రపతి కోవింద్ మోదీకి నమస్కరిస్తున్నా, మోదీ ఇది పట్టించుకోకుండా ఫోటోలకు పోజులిస్తున్నాడంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మోదీకి నమస్కరిస్తున్నా మోదీ ఇది పట్టించుకోకుండా ఫోటోలకు పోజులిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం):  ఈ దృశ్యాలు 23 జులై 2022న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాంనాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించినవి. ఐతే ఈ కార్యక్రమంలో, రాంనాథ్ కోవింద్ మోదీకి నమస్కరించినప్పుడు మోదీ తిరిగి  కోవింద్‌కు నమస్కరించాడు. కాని వైరల్ వీడియోలో ఈ భాగాన్ని తీసేసి, కేవలం మోదీ ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తున్న దృశ్యాలను మాత్రమే షేర్ చేసారు. కాబట్టి కోవింద్‌కు నమస్కరించకుండా మోదీ అవమానించాడన్న వాదన కరెక్ట్ కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియోపై ఉన్న లోగో ఆధారంగా వెతకగా రాంనాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించి ఈ దృశ్యాలను 23 జులై 2022న ప్రసారం చేసిన సంసద్ టీవీ ఫుటేజ్ మాకు లభించింది.

ఈ వీడియోలో రాంనాథ్ కోవింద్ పోడియం దిగి పార్లమెంట్ సభ్యులకు నమస్కారం చేస్తూ నడుస్తుండడం చూడొచ్చు. ఐతే ఈ వీడియోలో 59వ సెకండ్ వద్ద కోవింద్ ప్రధాని మోదీకి నమస్కరించగా మోదీ కూడా తిరిగి నమస్కరించాడు.

ఆ తర్వాత రాంనాథ్ కోవింద్ మోదీ వెనకాల ఉన్న ఒక మహిళా పార్లమెంట్ సభ్యురాలుతో మాట్లాడి ముందుకెల్లాడు. ఈ సందర్భంలో మోదీ ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తున్నాడు.

దీనిబట్టి మోదీ మరియు కోవింద్ పరస్పరం నమస్కరించుకున్న భాగాన్ని తీసేసి కేవలం మోదీ ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తున్న క్లిప్‌ను మాత్రమే మోదీ కోవింద్‌ను అవమానించినట్టు షేర్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసిన ఫోటోలలో కూడా మోదీ మరియు కోవింద్ పరస్పరం నమస్కరించుకోవడం చూడొచ్చు.

చివరగా, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను పట్టించుకోకుండా మోదీ ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తున్నాడంటూ ఒక డిజిటల్‌గా క్లిప్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll