Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కొరోనా వైరస్ కొన్ని ఉపరితలాల (గ్లాస్ మరియు ప్లాస్టిక్) పై సుమారు 72 గంటల (3 రోజుల) వరకు ఉంటుంది

1

ఒక ప్రదేశంలో కొరోనా వైరస్ జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు మరియు ఇది కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది’ అని చెప్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోని యూట్యూబ్ లో (ఆర్కైవ్డ్) కూడా చూడవొచ్చు.  ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం సుమారు 12 గంటలు మాత్రమే.

ఫాక్ట్ (నిజం): కొరోనా వైరస్ కొన్ని ఉపరితలాల (గ్లాస్ మరియు ప్లాస్టిక్) పై సుమారు 72 గంటల వరకు ఉంటుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొన్ని గంటల నుండి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై కొరోనా వైరస్ ఉండవచ్చని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వారు కూడా తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

‘జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం’ అని పెట్టి, పోస్టులోని విషయాన్నే చెప్తూ, కొన్ని వార్తాసంస్థలు [టీవీ9 (ఆర్కైవ్డ్) మరియు నమస్తే తెలంగాణ (ఆర్కైవ్డ్)] ఆర్టికల్స్ కూడా ప్రచురించినట్టు చూడవొచ్చు.

అయితే, పోస్టులోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ఈ విషయం పై National Institutes of Health, CDC, UCLA మరియు Princeton University కి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనకి సంబంధించిన రిపోర్ట్ ఒకటి ‘The New England Journal of Medicine’ వారి వెబ్సైటులో పబ్లిష్ చేసారు. వివిధ ఉపరితలాల పై SARS-COV-2 వైరస్ (తాజా కొరోనా వైరస్) (ఇంతకముందు HCoV-19 అనే వారు) మరియు SARS-COV-1 వైరస్ (2002-03 సమయంలో మనుషులకు సోకిన వైరస్) ఎంత సేపు ఉంటాయో పోలుస్తూ పరిశోధన చేసినట్టు తెలుస్తుంది.  వైరస్ల యొక్క డికే రేట్ (హాఫ్ లైఫ్) ప్రకారం (ఉష్ణోగ్రత 21-23°C and 40% రిలేటివ్ హ్యుమిడిటీ లో) పరిశోధనలు జరిపినట్టు చూడవొచ్చు.

రాగి మరియు కార్డ్‌బోర్డ్ కంటే ప్లాస్టిక్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్‌పై SARS-CoV-2 మరింత స్థిరంగా ఉందని, ప్లాస్టిక్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్‌ ఉపరితలాలకు పెట్టిన 72 గంటల వరకు ఆచరణీయ (వయబల్) వైరస్ కనుగొనబడిందని చూడవొచ్చు. శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ప్రకారం ఏరోసోల్ (గాలి లోని నీటి బొట్లు) మరియు వివిధ ఉపరితలాల పై SARS-CoV-2 కొరోనా వైరస్ ఎంత సేపటివరకు మనుషులను వ్యాధి గ్రస్తులు చేసే స్థితిలో ఉంటుందో కింద చుడండి.

వివిధ ఉపరితలాలపై కొరోనా వైరస్ ఎంతసేపు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని, ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొన్ని గంటల నుండి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై వైరస్ ఉండవచ్చని WHO వారు కూడా చెప్పినట్టు వారి వెబ్సైటులో చదవొచ్చు. అలానే, మునుపటి కొరోనా వైరస్లపై జరిపిన అధ్యయనాలను విశ్లేషిస్తూ ప్రచురితమైన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

కొన్ని ఉపరితలాల పై రెండు-మూడురోజుల వరకు కొరోనా వైరస్ ఉంటుందని వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఎండాకాలం (ఎక్కువ వేడి) మరియు వర్షాకాలంలో (ఎక్కువ హ్యుమిడిటీ) ఈ వైరస్ యొక్క వ్యాప్తి తగ్గోచ్చని ఒక స్టడీలో తేలినట్టు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, కొరోనా వైరస్ కొన్ని ఉపరితలాల (గ్లాస్ మరియు ప్లాస్టిక్) పై సుమారు 72 గంటల, అంటే 3 రోజుల వరకు ఉంటుంది.

వివరణ: కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ, PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వారు కూడా కరోనా వైరస్ 12 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది అనడానికి ఎటువంటి ఆధారం లేదని ట్వీట్ చేసారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll