Fact Check, Fake News, Telugu
 

2020 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో భారత దేశ GDP మిగతా ఆర్ధికంగా ప్రధానమైన దేశాలకంటే ఎక్కువగా క్షీణించింది

0

ఇటీవలే భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో భారత దేశ GDP 23.9% క్షీణించింది. ఈ నేపథ్యంలో, జీడీపీ ఈ త్రైమాసికంలో క్షీణించడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉందని, కెనడా జీడీపీ 38.7%, USA జీడీపీ 32.9%, జపాన్ జీడీపీ 27.8% క్షీణించాయని చెప్తూ చాలా సోషల్ మీడియా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2020 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో భారత దేశ GDP మిగతా ఆర్ధికంగా ప్రధానమైన దేశాలకంటే ఎక్కువగా క్షీణించిలేదు.

ఫాక్ట్(నిజం): 2019 ఏప్రిల్- జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో  దేశ జీడీపీ 23.9% క్షీణించింది. ఆర్ధికంగా ప్రధానమైన వేరే దేశాలకంటే భారత దేశ GDP ఎక్కువగా క్షీణించింది. పోస్టులో YoY మరియు annualized గణాంకాలు రెండు కలిపి పోల్చుతున్నారు. కానీ ఎదో ఒక రకమైన గణాంకాలను అన్ని దేశాలకు తీసుకొని పోల్చడం సరైనది, ఇలా రెండు కలిపి కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

Ministry of Statistics and Programme Implementation (MoSPI) 31 august 2020న విడుదల చేసిన GDP అంచనాల ప్రకారం 2019-2020వ ఆర్ధిక సంవత్సరం యొక్క మొదటి త్రైమాసికం Q1(ఏప్రిల్-జూన్ 2019) తో పోలిస్తే 2020-2021వ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత దేశ GDP 23.9% తగ్గింది.

సాధారణంగా భారత దేశంలో Year on Year (YoY) పద్థతిలో పోల్చి జీడీపీ అంకెలను విడుదల చేస్తారు. అంటే, గత ఆర్ధిక సంవత్సరంలోని ఒక త్రైమాసికానికి సంబంధించిన డేటాని ఈ ఆర్ధిక సంవత్సరంలోని అదే త్రైమాసికానికి సంబంధించిన డేటాతో పోల్చి హెచ్చు తగ్గులను పోలుస్తారు.

అమెరికాలో GDP అంకెలను ‘annualized method’ ప్రకారం విడుదల చేస్తారు, అంటే ఒక త్రైమాసికంలో పెరిగిన/క్షీణించిన జీడీపీని ఆధారంగా తీసుకొని మిగతా త్రైమాసికాల్లో కూడా జీడీపీ ఇదే రేటులో పెరుగుతుంది/ క్షీణిస్తుందని అంచనా వేసి మొత్తం సంవత్సరానికి annualized రేట్ లెక్కిస్తారు. దీనికి YoY కి చాలా తేడా ఉంది.

Year on Year పద్థతిలో పోల్చినప్పుడు:

భారత ప్రభుత్వ సమాచారం ప్రకారం 2019 ఏప్రిల్- జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో  దేశ జీడీపీ 23.9% క్షీణించింది. ఫ్రాన్స్ , ఇటలీ ప్రభుత్వ సమాచారం ప్రకారం 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ దేశాల జీడీపీ 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 18.9% & 17.7% క్షీణించింది. OECD డేటా ప్రకారం ఇదే త్రైమాసికంలో కెనడా జీడీపీ 13% క్షీణించింది, జర్మనీ ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇదే త్రైమాసికంలో జర్మనీ జీడీపీ 11.3% క్షీణిస్తే, OECD డేటా ప్రకారం UK జీడీపీ 21.7% క్షీణించింది. ఐతే అమెరికా మరియు జపాన్ annualized జీడీపీ డేటాని విడుదల చేసాయి. ఐతే ఈ డేటా ఆధారంగా Year on Year పద్ధతి ప్రకారం లెక్కేస్తే 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 9.1% క్షీణిస్తే, జపాన్ జీడీపీ 10% క్షీణించింది. ఐతే భారీ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశాలలో కేవలం చైనా జీడీపీ మాత్రమే పెరిగింది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చైనా జీడీపీ 3.2% పెరిగింది.

గత త్రైమాసికంతో పోల్చినప్పుడు (QoQ):

2020 జనవరి-మార్చ్ త్రైమాసికంతో పోల్చినప్పుడు ఫ్రాన్స్, ఇటలీ , జర్మనీ దేశాల జీడీపీ 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో  13.8%, 12.8%, 9.7 % క్షీణించాయి. క్రితం త్రైమాసికంతో పోల్చిస్తే UK జీడీపీ 20.4% క్షీణించింది. OECDలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కెనడా జీడీపీ గత త్రైమాసికంతో పోల్చిస్తే 11.5% క్షీణించగా, అమెరికా మరియు జపాన్ దేశాల జీడీపీ 9.1% & 7.8% క్షీణించాయి.

భారత ప్రభుత్వం Quarter on Quarter (QoQ) అనగా గత త్రైమాసికంతో పోల్చిన డేటా విడుదల చేయనప్పటికీ, గీత గోపీనాథ్ (IMF చీఫ్ ఎకనామిస్ట్) చేసిన ట్వీట్ ప్రకారం 2020 జనవరి-మార్చ్ త్రైమాసికంతో పోల్చినప్పుడు భారత దేశ జీడీపీ 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 25.6% క్షీణించింది. దీన్నిబట్టి ఏ పద్ధతిలో పోల్చినా (YoY & QoQ) భారత దేశ జీడీపీ G7 దేశాలు మరియు చైనా కన్నా ఎక్కువగా క్షీణించిందని కచ్చితంగా చెప్పొచ్చు.

వార్తా పత్రికలు కూడా తప్పుగా పోల్చాయి

Business Today వార్తా పత్రిక భారత దేశ జీడీపీని G7 దేశాల మరియు చైనా జీడీపీతో పోలుస్తూ విడుదల చేసిన ఇన్ఫోగ్రాఫిక్ లో కొన్ని దేశాల 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికం జీడీపీని గత త్రైమాసికం జీడీపీతో పోల్చి, మరికొన్ని దేశాల జీడీపీని గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చడంతో ఈ డేటా తప్పుదోవ పట్టించే విధంగా మారింది. దీన్ని షేర్ చేసి ప్రభుత్వాన్ని నిందిస్తూ అనేక సోషల్ మీడియా పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఐతే Business Today తరవాత ఈ పొరపాటును సరిచేసుకొని విడివిడగా డేటాని విడుదల చేసింది.

సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఇంకో ఇన్ఫోగ్రాఫిక్ లో YoY మరియు annualized గణాంకాలు రెండు కలిపి పోల్చుతున్నారు. కానీ ఎదో ఒక రకమైన గణాంకాలను అన్ని దేశాలకు తీసుకొని పోల్చడం సరైనది, ఇలా రెండు కలిపి కాదు. ఇలా చేయడం తప్పుదోవ పట్టించడమే. చివరగా, ఏ పద్ధతిలో లెక్కించినా భారత దేశ జీడీపీ G7 మరియు చైనా జీడీపీ కన్నా ఎక్కువగా క్షీణించింది.

Share.

About Author

Comments are closed.

scroll