Fake News, Telugu
 

రక్తదానం చేసినవారికి ఏడాది పాటు లక్ష రూపాయలు ఖర్చు వరకు ఉచిత వైద్యం అందిస్తున్నది ‘SaveYo’ అనే ప్రైవేటు సంస్థ

0

ఆంధ్రప్రదేశ్‌లో ఇకనుండి రక్తదానం చేసినవారికి వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఏడాది పాటు లక్ష రూపాయలు ఖర్చు అయ్యేంతవరకు ఉచిత వైద్యం అందించనున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో ఇకనుండి రక్తదానం చేసినవారికి వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఏడాది పాటు లక్ష రూపాయలు ఖర్చు వరకు ఉచిత వైద్యం అందిస్తుంది.

ఫాక్ట్ (నిజం): వై. యెస్. జగన్ ప్రభుత్వం రక్తదానం చేసినవారికి ఏడాదిలో లక్ష రూపాయలు ఖర్చు అయ్యేంత వైద్యం ఉచితంగా అందిస్తామని ఎక్కడ ప్రకటించలేదు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘SaveYo’ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది. ఈ ప్రైవేటు సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్న ఈ కొత్త పథకానికి సంబంధించిన వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైటులో వెతికితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్తదానం చేసినవారికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యేంత వైద్యం ఉచితంగా అందిస్తామని తెలుపుతూ ఎటువంటి ప్రెస్ రిలీజ్ లేదా GO జారీ చేయలేదని తెలిసింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రక్తదానం చేసినవారికి ఏడాది వరకు లక్ష రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, ఈ సమాచారాన్ని తెలుపుతూ ఇంటర్నెట్లో ఎటువంటి సమాచారం లేదు.

వై.ఎస్.జగన్ ఇటీవల ఆరోగ్య శాఖ అధికరులతో జరిపిన చర్చలో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ‘వైస్సార్ హెల్త్ క్లినిక్స్’, ‘నాడు-నేడు’ పథకాల పనులని వెంటనే అమలుపరచాలని ఆదేశించినట్టు ‘The New Indian Express’ 11 నవంబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. ఈ పనులని 2021 డిసెంబర్ నెల వరకు అమలుచేయాలని జగన్ ప్రభుత్వ అధికారులని ఆదేశించినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. కానీ, ఈ సమావేశంలో రక్తదానం చేసినవారికి లక్ష రూపాయలు ఖర్చు అయ్యేంత వైద్యం ఉచితంగా అందించనున్నట్టు వై.ఎస్.జగన్ ప్రకటించలేదు.

అయితే, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇటీవల ఒక ప్రెస్ మీట్లో రక్తదానం చేసినవారికి ఏడాదిలో లక్ష రూపాయలు ఖర్చు అయ్యేంత వైద్యం ఉచితంగా అందిచాలనే కాన్సెప్ట్ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ కాన్సెప్ట్ ‘SaveYo’ అనే బ్లడ్ డొనేషన్ సంస్థ వారు ఇచ్చినట్టు సుచరిత తెలిపారు. ఈ స్కీంకు సంబంధించిన మరింత స్పష్టత కోసం ‘SaveYo’ సంస్థ వారిని సంప్రదిస్తే, రక్తదానం చేసినవారికి ఏడాదిలో లక్ష రూపాయలు ఖర్చు అయ్యేంత వైద్యం ఉచితంగా అందించే పథకాన్ని తమ సంస్థ ప్రైవేటుగా అమలుచేస్తుందని ‘SaveYo’ సంస్థ అసోసియేట్ మాకు తెలిపారు. ఈ స్కీమ్ ఇప్పటికే అమలులో ఉందని, దీనికి కావలిసిన డబ్బులని ‘Suits.life’, కొన్ని NGOలు మరియు రక్త ధాన శిబిరాలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ పథకంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని గురించి స్పష్టత కోసం ‘SUITS’ టీమ్ వారికి ఈమెయిల్‌ చేయగా, రక్తదానం చేసినవారికి తాము లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.

చివరగా, రక్తదానం చేసినవారికి ఏడాది పాటు లక్ష రూపాయలు ఖర్చు వరకు ఉచిత వైద్యం అందిస్తున్నది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘SaveYo’ అనే ప్రైవేటు సంస్థ.

వివరణ (NOVEMBER 19, 2021):
ఈ ఆర్టికల్‌ని ‘SaveYo’ సంస్థ వారి లక్ష రూపాయలు ఉచిత వైద్యం పథకం వివరాలతో అప్డేట్ చేయటం జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll