Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఉద్దేశించి మార్కండేయ కట్జూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చేసినట్టు షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన, భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం, రాజ్యంగ ఉల్లంఘన జరుగుతుంది, తక్షణం రాష్ట్రపతి పాలన పెట్టాలని, మాజీ సుప్రీం కోర్టు నాయమూర్తి జస్టిస్ కట్జు రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాసినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ మరియు ఇక్కడ). ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వార్త షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో  ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యంగ ఉల్లంఘన జరుగుతునందున వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాసిన మాజీ సుప్రీం కోర్టు నాయమూర్తి జస్టిస్ కట్జూ.

ఫాక్ట్(నిజం):  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా 2017లో ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారన్న ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటనను వ్యతిరేకిస్తూ జస్టిస్ కట్జూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసాడు. ఆ సందర్భంలో అయన ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ రాష్ట్రపతికి లేఖ రాసింది 2017లో, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాదు.

ఈ విషయానికి సంబంధించిన సమాచారం కోసం ఆన్లైన్‌లో వెతకగా 2017లో జస్టిస్ కట్జూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారన్న ఆరోపణలతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటనను వ్యతిరేకిస్తూ జస్టిస్ కట్జూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసాడు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ కూడా చేసాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ‘రాజ్యాంగ విరుద్ధమైనది, నిరంకుశమైనది మరియు అప్రజాస్వామికమైనది’ అని అయన అన్నారు. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భావప్రకటన స్వేచ్ఛపై విమర్శలు చేసారు (ఇక్కడ మరియు ఇక్కడ).

ఇదిలా ఉండగా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి మార్కండేయ కట్జూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు గాని లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆయన స్పందించినట్టు ఎటువంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు. దీన్నిబట్టి, కట్జూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఉద్దేశించి మార్కండేయ కట్జూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చేసినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll