జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ పేపర్ క్లిప్‌ను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం – జమ్మూ సభలో రాహుల్ గాంధీ
ఫాక్ట్(నిజం): భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇందుకు పూర్తి మద్దతిస్తుందని’ మాత్రమే అన్నాడు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని ‘జమ్మూకాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తాం’ అని రాహుల్ అన్నట్టు షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఆర్టికల్ 370 రద్దుపై చేసిన తీర్మానంలో కూడా రద్దు చేసిన విధానాన్ని తప్పుబట్టిందే కాని, ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అనలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ అయిన న్యూస్ క్లిప్ కోసం గూగుల్‌లో వెతకగా, ‘నినాదం’ అనే పత్రిక ఈ వార్తను 24 జనవరి 2022 నాడు ప్రచురించినట్టు తెలిసింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇటీవల 23 జనవరి 2022న జమ్మూలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘జమ్మూకాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం’ అని అన్నట్టు వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ రిపోర్ట్ చేసింది. అలాగే ‘జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిందేనని అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ హామీ ఇచ్చినట్టు’ కూడా ఈ కథనంలో రిపోర్ట్ చేసారు.
కానీ, నిజానికి భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగ సభలో ఆర్టికల్ 370ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాహుల్ గాంధీ కేవలం ‘జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇందుకు పూర్తి మద్దతిస్తుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ప్రసంగాన్ని ప్రసారం చేసిన వీడియో ఇక్కడ చూడొచ్చు.
రాహుల్ గాంధీ జమ్మూ సభలో చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ‘నినాదం’ అనే వార్తా సంస్థ ‘జమ్మూకాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం ’ అని వ్యాఖ్యానించినట్టు రిపోర్ట్ చేసి ఉంటుంది. అంతకుముందు భారత్ జోడో యాత్ర జమ్మూకాశ్మీర్‌లో మొదలైనప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆర్టికల్ 370 రద్దును విమర్శించాడే తప్ప కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తుందని అనలేదు. ఇకపోతే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఆర్టికల్ 370కు సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్టికల్ 370పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసాడు.
ఆర్టికల్ 370పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం :
కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయం తరవాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీనిపై చర్చించి ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. ఈ తీర్మానంలో కేంద్రం తీసుకున్న ఈ చర్య ఏకపక్షం, మరియు పూర్తిగా అప్రజాస్వామికం అని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత మరియు భారత రాజ్యాంగానికి అనుగుణంగానే ఆర్టికల్ 370కు సవరణలు చేయాలని పేర్కొంది.
దీన్నిబట్టి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని అనలేదని, కేవలం ఆర్టికల్ 370ను రద్దు చేసిన విదానాన్ని తప్పుబట్టిందని స్పష్టమవుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీ నిజంగానే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించి ఉంటే ప్రధాన వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి. కానీ రాహుల్ గాంధీ అలా అన్నట్లు ఏ సంస్థ రిపోర్ట్ చేయలేదు. కేవలం జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాం అని మాత్రమే అన్నట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరిగా, జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.