మత్స్యరూపంలో ఉన్న జలకన్యలు నది తీరాన సేద తీరుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జలకన్యలు నది తీరాన సేద తీరుతున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన జలకన్య కాదు. ‘JJPD Productions’ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్టు వివరణలో స్పష్టం చేసింది. ఈ CGI వీడియోని జిమ్మీ పెరెజ్ అనే 3D యానిమేటర్ రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘JJPD Productions’ అనే యూట్యూబ్ ఛానల్ 17 జులై 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని కంప్యూటర్-జనరేటెడ్ ఇమేజరీ (CGI) టెక్నాలిజీని ఉపయోగించి రూపొందించినట్టు ‘JJPD Productions’ వీడియో వివరణలో స్పష్టం చేసింది.
ఈ వీడియోని జిమ్మీ పెరెజ్ అనే 3D యానిమేటర్ రూపొందించినట్టు తెలిసింది. జిమ్మీ పెరెజ్ రూపొందించిన మరికొన్ని CGI వీడియోలని అతని ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించిందని, ఈ వీడియోలో కనిపిస్తుంది నిజమైన జలకన్య కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇంతకు ముందు కూడా, ‘JJPD Productions’ పబ్లిష్ చేసిన మరికొన్ని జలకన్యల CGI వీడియోలని నిజమైన జలకన్యల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ ఆ వీడియోలకి సంబంధించిన ఒక ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరగా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించిన వీడియోని నది తీరాన జలకన్యలు సేద తీరుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.