Fake News, Telugu
 

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ బయో నుండి మంత్రి పదం తొలగించాడన్న వాదన తప్పు

0

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ‘సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్‌ ఖాతాలో ఉన్న మంత్రి పదాన్ని తొలగించారు’  అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో, సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్‌ బయో నుండి మంత్రి పదాన్ని తొలగించారు.

ఫాక్ట్ (నిజం): ఆదిత్య ఠాక్రే మొదటినుండి తన ట్విట్టర్ బయోలో మంత్రి పదాన్ని పేర్కొనలేదు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అయన తన ట్విట్టర్ బయోకు ఎటువంటి మార్పు చేయలేదు. ఇంటర్నెట్‌లో ఆర్కైవ్‌ చేసి ఉన్న ఆదిత్య ఠాక్రే ట్వీట్స్ ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఇప్పటికీ మంత్రి అనే ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మహారాష్ట్రలో అధికారంలోని శివ సేన పార్టీకి చెందిన పలువురు ఎంఎల్ఏలు తిరుగుబాటు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిన్న రాత్రి (22 జూన్ 2022) సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి తన వ్యక్తిగత నివాసానికి వెళ్ళిపోయారు.

ఐతే ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు మరియు కొందరు జర్నలిస్టులు ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్‌ ఖాతాలోని బయో నుండి మంత్రి పదాన్ని తొలగించారని వార్తను ప్రచురించారు. ఇలా ఈ వార్త సోషల్ మీడియా లో కూడా షేర్ అవడం మొదలైంది.

పలు తెలుగు వార్తా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. ఐతే నిజానికి ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్‌ బయోలో ఎటువంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ఎలా ఉండేదో, రాజకీయ సంక్షోభం మొదలైనాక కూడా అలానే ఉంది.

ఐతే ఆదిత్య ఠాక్రే ఇంతకుముందు కూడా తన ట్విట్టర్‌ బయోలో మంత్రి అని పేర్కొనలేదు. ఆదిత్య థాక్రే 30 డిసెంబర్ 2019న మంత్రిగా ప్రమాణం చేసాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతని ట్విట్టర్ బయో ఒకేలా ఉంది. ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతాకు సంబంధించి గతంలో ఇంటర్నెట్‌లో ఆర్కైవ్‌ చేసి ఉన్న ట్వీట్స్ ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది.

అయన మంత్రి అయినప్పటినుండి ఇప్పటివరకు అయన ట్వీట్స్ చాలా ఆర్కైవ్ చేసారు. దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. ఉదాహారణకి అయన మంత్రి అయిన తరవాత 22 మార్చ్ 2020న ఆర్కైవ్ చేసిన ట్వీట్ మరియు ఈ రోజు తన ట్విట్టర్ బయోను పోలుస్తే ఈ విషయం అర్ధమవుతుంది.

అలాగే ఆదిత్య ఠాక్రే తన ఫేస్‌బుక్ బయోలో కూడా మంత్రి పదం పేర్కొనలేదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ బయోలో మాత్రమే మంత్రి హోదా పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మంత్రి హోదా అలాగే ఉంది.

వీటన్నిటిబట్టి పోస్టులో చెప్తున్నట్టు రాజకీయ సంక్షోభం మధ్యలో ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ బయో నుండి మంత్రి హోదా తొలగించాడన్న వాదన తప్పని స్పష్టమవుతుంది.

చివరగా, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ బయో నుండి మంత్రి హోదా తొలగించాడన్న వాదన తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll