Fact Check, Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం ‘జన్‌ధన్’ ఎకౌంట్లలో 5,000 రూపాయలు జమచేయట్లేదు

0

‘ప్రభుత్వం జన్‌ధన్ బ్యాంకు అకౌంట్ దారులందరికి 5,000 రూపాయలు జమచేస్తుంది, ఇప్పటికే 20 కోట్ల ఎకౌంట్లలో ఈ డబ్బు జమచేసింది’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ప్రభుత్వం జన్‌ధన్ బ్యాంకు అకౌంట్ దారులందరికి 5,000 రూపాయలు జమచేస్తుంది, ఇప్పటికే 20 కోట్ల ఎకౌంట్లలో ఈ డబ్బు జమచేసింది’.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల జన్‌ధన్ ఎకౌంట్లలో రూ. 5,000 జమ చేయలేదు. సాధారణంగా జన్‌ధన్ అకౌంట్ ఉన్నవారు రూ. 5,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో లోన్ పొందవచ్చు, ఈ సదుపాయాన్ని 2018లో రూ. 10,000లకు పెంచారు. ఐతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా పొందగలిగే ఈ రూ. 5,000లను, కేంద్ర ప్రభుత్వం అందరి జన్‌ధన్ ఎకౌంట్లలో రూ. 5,000 జమ చేస్తుందని తప్పుగా అర్ధంచేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన:

ప్రతి ఇంటికి ఒక బ్యాంకు ఖాతా అందించడం ద్వారా ప్రజలకి ఆర్ధిక అవగాహన కల్పించి వారందరిని ఆర్ధిక వ్యవస్థలో భాగం చేయాలనే ఉద్దేశంతో 2014లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ స్కీం వల్ల కలిగే కొన్ని లాభాలు కింద చూడొచ్చు.

  • ఇవి జీరో బ్యాలన్స్ అకౌంట్స్. పైగా ఈ అకౌంట్స్ కి రూపే డెబిట్ కార్డు కూడా అందించారు.
  • ఈ అకౌంట్స్ ద్వారా రూపే కార్డ్స్ పొందినవారికి లక్ష రూపాయల వరకు (2018 నుండి రెండు లక్షలు) ప్రమాద ఇన్సూరెన్సు కవర్ కూడా అందిస్తున్నారు.
  • సాధారణంగా జన్‌ధన్ అకౌంట్స్ ఉన్నవారు  ప్రభుత్వం చేపట్టే నగదు బదిలీ పథకాలు, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన్ మంత్రి సురక్ష బీమ యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), ముద్రా యోజన వంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు.

ఈ స్కీం ద్వారా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకి వారి అత్యవసరాలకు ఎలాంటి పూచికత్తు లేకుండా 5,000 రూపాయల వరకి రుణాలను ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో జన్‌ధన్ అకౌంట్స్ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ఐతే ఈ సదుపాయాన్ని పొందడానికి కొన్ని షరతులు కూడా విధించారు.

  • ఈ ఎకౌంటుని వాడడం మొదలు పెట్టి కనీసం ఆరు నెలల అయ్యుండాలి.
  • ఎకౌంటుని ఆదార్ తో సీడ్ చేసి ఉండాలి
  • ఈ ఎకౌంటులో రెగ్యులర్ గా ప్రభుత్వ నగదు బదిలి స్కీంస్ లేదా ఇతర స్కీమ్స్ ద్వారా లావాదేవీలు జరుగుతుండాలి.

పైగా జన్‌ధన్ అకౌంట్ కలిగిన వారు ఈ ఎకౌంటులో ఉండే నెలసరి సగటు బాలన్స్ కి నాలుగు రెట్లు (లేదా) లోన్ పొందే తేదీకి ముందు ఆరు నెలల క్రెడిట్ సమ్మెషన్ల విలువ (లేదా) రూ. 5,000, ఈ మూడింటిలో దేని విలువ తక్కువగా ఉంటుందో ఆ మొత్తం విలువ వరకు లోన్ పొందొచ్చు. అంటే ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో గరిష్టంగా 5,000 రూపాయల వరకు లోన్ పొందొచ్చు. ఐతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా పొందగలిగే ఈ 5,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరి అకౌంట్ లో ఉచితంగా జమచేస్తుందని తప్పుగా అర్ధం చేసుకొని అవకాశం ఉంది. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే 2018లో ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా పొందే గరిష్ట విలువని రూ. 10,000కి పెంచారు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఇప్పటివరకి 20 కోట్ల బ్యాంకు అకౌంట్స్లో 5,000 రూపాయలు జమ చేసారని ఎటువంటి అధికారిక సమాచారం గాని లేదా వార్తా కథనాలు గాని ఏవి మాకు లభించలేదు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగుంటే వార్తా సంస్థలు ఈ విషయాన్నీ ప్రచురించేవి, కాని మాకు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. కాకపోతే లాక్ డౌన్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో జన్‌ధన్ అకౌంట్ కలిగిన పేద మహిళల అకౌంట్ లో రూ. 500లను మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం జమచేసింది. వీటన్నిటి బట్టి పోస్టులో చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ అకౌంట్ కలిగిన వారికి రూ. 5,000 జమచేయట్లేదని అర్ధమవుతుంది.

ఇంతకుముందు కూడా ఇలాగే ప్రధాన మంత్రి మాన్ ధన్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరి ఎకౌంటులో రూ. 3,000 జమ చేస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, PIB ఈ వార్తని తప్పని దృవీకరించింది.

చివరగా, కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఎకౌంట్లలో 5,000 రూపాయలు జమచేయట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll