Fake News, Telugu
 

సంగీత స్వరకర్త మయూరం విశ్వనాథ శాస్త్రి ఫోటోని హిట్లర్ వేదాలను అనువదించడం కోసం జర్మనీకి పిలిపించుకున్న దండిభట్ల విశ్వనాథ శాస్త్రి చిత్రమంటూ షేర్ చేస్తున్నారు

0

రెండవ ప్రపంచ యుద్ద సమయంలో అడాల్ఫ్ హిట్లర్ రాజామహేంద్రవరానికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితుడు దండిభట్ల విశ్వనాథ శాస్త్రిని జర్మనీకి పిలిపించుకొని మరీ భారతీయ వేదాలను అనువదించుకున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన భారతీయ రాయబారికి, జర్మని ప్రభుత్వ కార్యాలయంలో అమర్చిన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి చిత్రపటాన్ని అక్కడి అధికారులు చూపించారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నాజీ పార్టీ స్థాపించిన తరువాత హిట్లర్‌కు కొత్త మారణాయుధాలు, యుద్ధపరికరాల నిర్మాణానికి సంబంధించి భారతీయ వేదశాస్త్రాలలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందని, దీనికోసం భారతీయ వేదశాస్త్రాలను విడమరిచి చెప్పే పండితుడి కోసం వెతుకుతుండగా దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గురించి తెలుసుకొని హిట్లర్ అతన్ని జర్మనికి పిలపించుకున్నారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బాంబులు, క్షిపణులు నిల్వచేయడానికి సంబంధించి ఎదురైన ఒక సమస్యకు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి తన యజుర్వేదం జ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారాన్ని సూచించారని ఈ పోస్టులో తెలుపుతున్నారు.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అడాల్ఫ్ హిట్లర్ సంస్కృత వ్యాకరణ పండితుడు దండిభట్ల విశ్వనాథ శాస్త్రిని జర్మనీకి పిలిపించుకొని మరీ వేదాలను అనువధించుకున్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రముఖ సంగీత స్వరకర్త మయూరం విశ్వనాథ శాస్త్రి. రెండవ ప్రపంచ యుద్దంలో ఆయుధాలు తయారుచేయడం కోసం హిట్లర్ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తిని జర్మనీకి రప్పించుకొన్నాడాని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథ ‘మెయిన్ కంప్ఫ్’ పుస్తకంలో సంస్కృతం భాషకు సంబంధించి గానీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి గురించి గానీ ఎక్కడ ప్రస్తావించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Wikimedia Commons’ వెబ్సైటులో పబ్లిష్ చేసనట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మయూరం విశ్వనాథ శాస్త్రి అని ఫోటో వివరణలో తెలిపారు.

మయూరం విశ్వనాథ శాస్త్రి (1893-1958) తమిళనాడు రాష్ట్రం తెరెజుందూర్ గ్రామానికి చెందిన ఒక ప్రముఖ సంగీత స్వరకర్త, గేయ రచయిత. మయూరం విశ్వనాథ శాస్త్రి స్వరపరిచిన అనేక గీతాలు ఆల్ ఇండియా రేడియో (AIR) రాగం యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేశారు. సంస్కృతం, తమిళ మరియు ఆంగ్లేయ భాషలలో మయూరం విశ్వనాథ శాస్త్రికి మంచి పట్టు ఉందని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కానీ, హిట్లర్ మయూరం విశ్వనాథ శాస్త్రిని రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జర్మనికి పిలిపించుకున్నారని ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత దేశం నుండి పశ్చిమ జర్మనీకి రాయభారీగా వెళ్ళిన ఒక భారత అధికారికి, అక్కడి అధికారులు తమ ప్రభుత్వ కార్యాలయంలో అతికించిన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి చిత్రపటాన్ని చూపించారని జి.పుల్లారెడ్డి అభినందన సంచిక ‘మధుకోశం’లో తెలిపారంటూ పలు యూసర్లు కనీసం 2015 నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. కానీ, ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకున్నట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.   

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ తెలుగు పండితుడు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి సహాయంతో ఆయుధాలు రూపొంధించిందని మయూరి విశ్వనాథ శాస్త్రి ఫోటోని షేర్ చేస్తూ ‘సమయం’ వార్తా సంస్థ 2017లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆయుధాల తయారీ కోసం దండిభట్ల విశ్వనాథ శాస్త్రిని హిట్లర్ జర్మనీకి ఆహ్వానించి మ్యూనిచ్ యూనివర్సిటీలో సంస్కృతం విభాగాన్ని ఏర్పాటు చేసి అతన్ని ఆచార్యులుగా నియమించినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. కానీ, దండిభట్ల విశ్వనాథ శాస్త్రికి సంబంధించిన ఏ ఒక్క సమాచారం కూడా మాకు మ్యూనిచ్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైటులో దొరకలేదు.

19వ శతాబ్దం కాలం నుండే జర్మని స్కాలర్లకు సంస్కృత భాష మరియు భారతీయ శాస్త్రీయ వేదాలను అనువధించాలనే ఆసక్తి మొదలైందని, దీనికోసం జర్మని విశ్వ విధ్యాలయాలాలో ఇండోలాజి అనే సబ్జెక్టు కూడా ప్రారంభించారని తెలిసింది. 20వ శతాబ్దంలో జర్మనీలో ఇండోలాజిపై మరింత ఆసక్తి పెరిగిందని పలు అధ్యాయనాలు తెలిపాయి. కానీ, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన ఆయుధాల నిర్మాణానికి సంబంధించి దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి జర్మనీకి సహాయం చేసినట్టు ఎక్కడ ఆధారాలు దొరకలేదు.

అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథ గురించి తెలుపుతూ రాసిన ‘మెయిన్ కంప్ఫ్’ పుస్తకంలో సంస్కృతం భాషకు సంబంధించి గానీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి గురించి గానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

చివరగా, సంగీత స్వరకర్త మయూరం విశ్వనాథ శాస్త్రి ఫోటోని హిట్లర్ సంస్కృత వేదాలను అనువదించడం కోసం జర్మనీకి రప్పించుకున్న దండిభట్ల విశ్వనాథ శాస్త్రి చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll