కేంద్రం నిధులతో హైదరాబాదులో నిర్మించిన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ యొక్క దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి-గచ్చిబౌలి మధ్య నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: షేక్‌పేట్ ఫ్లై ఓవర్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించారు.
ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ నగరంలో సెవెన్ టాంబ్స్ జంక్షన్ నుండి విస్పెర్ వ్యాలి జంక్షన్ కలుపుతూ కట్టిన ఫ్లై ఓవర్‌ని (షేక్‌పేట్ ఫ్లై ఓవర్) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (SRDP) భాగంగా నిర్మించింది. SRDP కింద చేపట్టిన నిర్మాణ పనులకు కావలిసిన అన్ని నిధులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. SRDP ప్రాజెక్టులలో ఒకటైన షేక్‌పేట్ ఫ్లై ఓవరు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి భాగస్వామ్యం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్న షేక్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారం కోసం గుగూల్‌లో వెతికితే, హైదరాబాద్ నగరంలో సెవెన్ టాంబ్స్ జంక్షన్ నుండి విస్పెర్ వ్యాలి జంక్షన్ కలుపుతూ కట్టిన ఫ్లై ఓవర్ (షేక్‌పేట్ ఫ్లై ఓవర్), గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (SRDP) భాగంగా నిర్మిస్తున్నట్టు తెలిసింది. 333 కోట్ల వ్యయంతో GHMC షేక్‌పేట్ ఫ్లై ఓవరుని నిర్మిస్తున్నట్టు తెలిసింది. 2021 సెప్టెంబర్ నెలలో SRDP కింద చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించి తెలంగాణ శాసనసభలో అడిగిన ఒక ప్రశ్నకు, మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సమాధానమిస్తూ, “రాష్ట్ర ప్రభుత్వం SRDP కింద పూర్తి చేసిన 22 నిర్మాణ పనుల కోసం 1946.9 కోట్లు, నిర్మాణంలో ఉన్న 24 ప్రాజెక్టుల కోసం 5693.51 కోట్లు కేటాయించింది”, అని సమాధానమిచ్చారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న షేక్‌పేట్ ఫ్లై ఓవర్, జూన్ 2022 నాటికి పూర్తి అవుతుందని కేటిఆర్ శాసనసభలో ప్రకటించారు.
షేక్ పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, GHMC 2021-22 బడ్జెటులో SRDP నిర్మాణ పనుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి తీసుకున్న ఋణాలకు సంబంధించిన వివరాలు దొరికాయి. GHMC 2021-22 బడ్జెట్లో SRDP కింద చేపట్టిన నిర్మాణ పనుల కోసం 1000 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో, 2500 కోట్లు రూపీ టర్మ్ లోన్ (RTL) రూపంలో అప్పు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం GHMCని ఆదేశించినట్టు తెలిసింది. అంతేకాదు, SRDP ప్రాజెక్టుల కోసం GHMC తీసుకున్న పాత రుణాలు వాటిపై చెల్లించిన వడ్డిల వివరాలను GHMC 2021-22 బడ్జెట్లో తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ 2021-22 బడ్జెటులో SRDP నిర్మాణ పనుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి రుణం తీసుకున్నట్టు తెలిసింది. SRDP ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు సంబంధించి ‘ది టైమ్స్ఆఫ్ ఇండియా’ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. SRDPలో భాగంగా నిర్మించిన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ లేదా, మరే ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్ర నిధులు మంజూరు చేసినట్టు ఎక్కడా సమాచారం లేదు.
చివరగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ SRDPలో భాగంగా నిర్మించిన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు.