Fake News, Telugu
 

భారతీయ కార్మికులు ఉద్యమిస్తేనే బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు

0

ప్రపంచంలోని చాలా భాగాన్ని బ్రిటిష్ వారు పాలించడంతో ఆనాటి నుంచే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారని, భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికే ఆదివారాన్ని సెలవు దినంగా చేశారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పడు చూద్దాం.

క్లెయిమ్: బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలనలోనే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికే ఆదివారాన్ని భారత్‌లో సెలవు దినంగా చేశారు.

ఫాక్ట్: ఆదివారం విశ్రాంత దినం అని బైబిల్లో చెప్పబడింది, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ 321 లోనే దీని గురుంచి చట్టం చేశాడు.  బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడక ముందు నుంచే వివిధ ప్రదేశాలలో ఆదివారాన్ని సెలవు దినంగా పాటించే వారు. ఇక భారత్‌లో ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి భారతీయ సంఘ సంస్కర్తలు చేసిన కృషి కారణమని ఆధారాలు ఉన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఆదివారం ఎప్పటి నుంచి సెలవు దినంగా ఉందనే విషయాన్ని వెతకగా, మొదటిసారి రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ 321వ సంవత్సరంలోనే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ చట్టాన్ని చేశాడని Britannica వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

అలాగే బ్రిటిష్ వారు పాటించే క్రైస్తవ మతంలో కూడా ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చెప్పబడింది. దీన్ని బట్టి, ఆదివారాన్ని విశ్రాంతి దినంగా భావించడం అనేది బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడక ముందునుంచే ఉందని , బ్రిటిష్ వాళ్ళు దీన్ని సొంతంగా  ప్రకటించడం వంటిది జరగలేదని చెప్పవచ్చు.

ఇక భారత దేశంలో బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు ఆదివారం సెలవు దినంగా ఉన్నప్పటికీ భారతీయ కార్మికులు మాత్రం వారంలో ఏడు రోజులూ పనిచేయవలసి వచ్చేది. అయితే 1891 లో సంఘ సంస్కర్త నారాయణ్ మేఘ జీ లోఖండే వంటి వారు చేసిన కృషి వల్ల కార్మికులకు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం పరిశ్రమల చట్టం, 1891 ని తెచ్చింది.

మొత్తానికీ, ప్రపంచంలో వివిధ ప్రదేశాలలో ఆదివారాన్ని సెలవు దినంగా బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడక ముందు నుంచే పాటించే వారని, భారత్‌లో ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి భారతీయ సంఘ సంస్కర్తలు చేసిన కృషి కారణమని నిర్ధారించవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll