Fake News, Telugu
 

అమెరికాలో ప్రత్యేక హిందూ దేశం అంటూ ఈ వీడియోలో చెప్తున్న సమాచారం అసంపూర్ణంగా ఉంది

0

Update (26 July 2023):

‘హోలాండ్ కరెన్సీ నోటుపై శ్రీరాముడు!’ అంటూ ఇంతకు ముందు ఫాక్ట్-చెక్ చేసిన కరెన్సీ నోటు ఫోటోని మళ్ళీ షేర్ చేస్తున్నారు. అయితే క్రింద వివరించినట్టు, గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ (GCWP) అనే ఒక విద్యా సంస్థల కన్సార్టియం యొక్క అమెరికా/ నెదర్లాండ్స్‌లోని కేంద్రాలు మరియు కొన్ని షాప్స్ ఈ కరెన్సీ నోట్లను నియమాలకు లోబడి అంతర్గతంగా వినియోగిస్తున్నాయి.

Published (13 July 2023):

యోగా, వేదాల సాయంతో ప్రపంచ శాంతి నెలకోల్పాలనే లక్ష్యంతో అమెరికాలోని అయోవా రాష్ట్రంలో గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ (GCWP) పేరుతో ఒక ప్రత్యేక హిందూ దేశం ఉందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అలాగే ఈ దేశానికి ‘రామ్’ అనే ప్రత్యేక కరెన్సీ ఉందని, అమెరికా మరియు యూరోప్ ఆమోదించిన ఈ ఒక్క రామ్ పది అమెరికన్ డాలర్లతో సమానం అని కూడా ఈ వీడియోలో చెప్తున్నారు. వీడియోలో ఈ దేశానికి సంబంధించి అనే విషయాల గురించి ప్రస్తావించారు. ఈ కథనం ద్వారా వీడియోలో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ పేరుతో అమెరికాలో ఒక ప్రత్యేక హిందూ దేశం ఉంది; అమెరికా ప్రభుత్వం ఈ దేశ కరెన్సీ అయిన రామ్‌ను గుర్తించింది.

ఫాక్ట్(నిజం): GCWP అనేది ఒక విద్యా సంస్థల కన్సార్టియం. అతీంద్రియ ధ్యానం, విద్య మరియు వేద జ్ఞానం ద్వారా ప్రజలలో ఒక స్పృహను నెలకొల్పే లక్ష్యం కోసం GCWP ప్రయత్నిస్తుంది. దీనికి వివిధ దేశాలలో కూడా శాఖలు ఉన్నాయి. అలాగే అమెరికాలోని అయోవా రాష్ట్రంలో కూడా ఉంది. అయోవాలోని GCWP ప్రత్యేక దేశమేమి కాదు. దీనికి ప్రత్యేక దేశంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఏది లేదు. పైగా GCWP ప్రత్యేకంగా ఉపయోగించే కరెన్సీ ‘రామ్‌ను’ అమెరికా ప్రభుత్వం లీగల్ టెండర్‌గా గుర్తించలేదు. కాకపోతే అమెరికా/ నెదర్లాండ్స్‌లోని GCWP కేంద్రాలు మరియు కొన్ని షాప్స్ వీటిని నియమాలకు లోబడి అంతర్గతంగా వినియోగిస్తున్నాయి.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్‌ (GCWP) అనేది ప్రపంచ శాంతి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఒక NGO. మహర్షి మహేష్ యోగి  దీనిని 2000లో స్థాపించారు. అతీంద్రియ ధ్యానం, విద్య మరియు వేద జ్ఞానం ద్వారా ప్రజలలో ఒక స్పృహను (consciousness) నెలకొల్పే లక్ష్యం కోసం GCWP ప్రయత్నిస్తుంది. గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ (GCWP) వెబ్‌సైట్‌లో దీనిని ఒక విద్యా సంస్థల కన్సార్టియంగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ సంస్థకు డాక్టర్ టోనీ నాడర్ నాయకత్వం వహిస్తున్నారు. GCWP ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లో ఉంది.

ఐతే వీడియోలో చెప్తున్నట్టు ఈ కేంద్రాలలో వేద జ్ఞానం, వాస్తు మొదలైన ప్రాచీన హిందూ జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ తమ లక్ష్యాల కోసం ప్రయత్నిస్తుంటారు. కాని వీడియోలో ఈ కేంద్రాలలో వినియోగించే కరెన్సీ, మొదలైన విషయాల గురించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయి. వీటి గురించి కింద చూద్దాం.

అమెరికాలో GCWP ఒక ప్రత్యేక దేశం కాదు:

వీడియోలో చెప్తున్నట్టు అమెరికాలో GCWP అనేది ఒక ప్రత్యేక దేశమేమి కాదు. దీనికి ప్రత్యేక దేశంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఏది లేదు. GCWPకి వివిధ దేశాలలో కూడా శాఖలు ఉన్నాయి.

అలాగే అమెరికాలోని అయోవా రాష్ట్రంలో కూడా ఉంది. అయోవాలోని తమ సెంటర్‌కు ‘మహర్షి వేదిక్ సిటీ’ అని పేరు. కాకపోతే ఈ సెంటర్‌లో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అలాగే పాలనకు సంబంధించి వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకొని, వాటికీ అధికారులను (మంత్రులను) కేటాయించుకున్నారు.

GCWPకి ప్రత్యేక కరెన్సీ:

గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ ‘రామ్‘ పేరుతో 2001లో ప్రత్యేకంగా కరెన్సీని ప్రారంభించింది. కరెన్సీ నోట్‌పై రాముడి ఫోటోను ముద్రించారు. వీడియోలో చెప్తున్నట్టు అమెరికా మరియు నెదర్లాండ్స్‌లోని పలు ప్రాంతాలలో వాడుతున్నారు, కాని దీనిని అమెరికా ప్రభుత్వం గాని నెదర్లాండ్స్‌ ప్రభుత్వం గాని ‘లీగల్ టెండర్’ (అధికారికంగా) గుర్తించలేదు.

ఈ కరెన్సీని ప్రారంభించిన కొత్తల్లో ప్రచురించిన వార్తా కథనాల (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం నెదర్లాండ్స్‌ ప్రభుత్వం కూడా ఈ కరెన్సీని లీగల్ టెండర్‌గా గుర్తించలేదు. వీటిని కేవలం క్లోస్డ్ సర్క్యూట్‌లో (ఉదాహారణకు GCWP సెంటర్‌ మరియు దాని అనుబంధ సంస్థలు) మాత్రమే ఉపయోగించవచ్చు.

నెదర్లాండ్స్‌లో పలు షాప్స్‌లో ఈ కరెన్సీని ఉపయోగించేవారని, 2003లో నెదర్లాండ్స్‌లో 1 రామ్‌కి 10 యూరోల విలువ ఉండేదని ఈ కథనం రిపోర్ట్ చేసింది. దీన్నిబట్టి ఈ కరెన్సీని కేవలం అంతర్గతంగా వాడుతున్నారు కాని, ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా గుర్తించలేదని స్పష్టమవుతుంది.

చివరగా, అమెరికాలో ప్రత్యేక హిందూ దేశం అంటూ ఈ వీడియోలో చెప్తున్న సమాచారం అసంపూర్ణంగా ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll