Fake News, Telugu
 

హైదరాబాద్ మెట్రోలో ఉర్దూలో మాత్రమే టికెట్లను జారీ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం

0

హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ కేవలం ఉర్దూ భాషలో మాత్రమే జారీ చేస్తున్నట్లు చెప్పే విధంగా ఉన్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్ మెట్రో రైలులో కేవలం ఉర్దూలో మాత్రమే టికెట్లను జారీ చేస్తారు.

ఫాక్ట్: సాధారణంగా టికెట్ కౌంటర్లలో జారీ చేసే టికెట్లు ఇంగ్లీషులో ఉంటాయి. వెండిగ్ మెషిన్ ద్వారా జారీ చేసే టోకెన్లు లేదా స్మార్ట్ కార్డ్ రీఛార్జులకు ఇచ్చే రసీదులు, వెండిగ్ మెషిన్లో ప్రయాణికుడు ఎంచుకున్న భాషను బట్టి ప్రింట్ అవుతాయి. సిబ్బంది తప్పుగా ఉర్దూ భాషని ఎంచుకోవడం వలన రశీదు ఉర్దూలో ప్రింట్ అయ్యిందని, దాన్ని సరిచేసి మళ్ళీ ఇంగ్షీషులో వచ్చేలాగా పునరుద్ధరించామని మెట్రో అధికారులు పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు దోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ అవుతున్న ఫోటోను పరిశీలించగా, అది వెండిగ్ మెషిన్లో మెట్రో స్మార్ట్ కార్డ్ రీఛార్జి చేసుకున్నాక జారీ అయ్యే రశీదు అని తెలుస్తుంది. సాధారణంగా టికెట్ కౌంటర్లో ఇచ్చే టికెట్ ఈ విధంగా ఇంగ్లీషులో ప్రింట్ చేయబడి ఉంటుంది.

ఇక ఈ విషయంపై మరింత సమాచారం కోసం హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక వెబ్‌సైట్ లో ఉన్న కస్టమర్ కేర్‌ని సంప్రదించగా, మెట్రో టికెట్లను ఎన్ని భాషలలో జారీ చేసే విషయంపై వారి వద్ద తగిన సమాచారం లేదని సమాధానం ఇచ్చారు. KPHB మరియు JNTU స్టేషన్లలో కూడా టికెట్ కౌంటర్లో వేరే భాషలో టికెట్లు కావాలని అడిగితే కేవలం ఇంగ్లీషులో మాత్రమే జారీ అవుతాయని చెప్పారు.

తరువాత, టికెట్ కౌంటర్ పక్కనే ఉన్న వెండిగ్ మెషిన్లో ప్రయత్నించాము. అక్కడ ముందుగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మరియు హిందీ భాషలలో ఒక దానిని ఎంచుకొని టికెట్‌ను(టోకెన్) కొనడం లేదా స్మార్ట్ కార్డ్‌ను రీఛార్జి చేసుకోవడం చేయాల్సి ఉంటుంది.

అయితే మేము టికెట్లు తీసుకునే సమయానికి రశీదు లేకపోవడంతో ఇదివరకే వివిధ ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషలలో జారీ అయిన రసీదులను క్రింద జతచేశాము.

దీనిపై తెలంగాణ ప్రభుత్వ ఫాక్ట్ చెక్ విభాగం కూడా స్పందిస్తూ, వివిధ ప్రాంతాలనుంచి వచ్చే ప్రయాణీకుల సౌకర్యార్ధం 4 భాషాలలో టికెట్లను(రసీదులను) హైదరాబాద్ మెట్రో రైల్ జారీ చేస్తుందని పేర్కొన్నారు.

Update (13 ఏప్రిల్ 2023): ఈ విషయంపై హైదరాబాద్ మెట్రో అధికారులని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగా, హైదరాబాద్ మెట్రో టికెట్లను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషలలో ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇంగ్లీషు డిఫాల్ట్ భాషగా సెట్ చేయబడి ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బంది తప్పుగా ఉర్దూని ఎంచుకోవడం వలన టికెట్ ఉర్దూలో ప్రింట్ అయ్యిందని. తర్వాత దాన్ని సరిచేసి ఎప్పటిలాగానే ఇంగ్లీషులో టిక్కెట్ వచ్చేలా పునరుద్ధరించామని స్పష్టం చేశారు.

చివరిగా, హైదరాబాద్ మెట్రో టికెట్లను కేవలం సాధారణంగా ఇంగ్లీషులోనే జారీ చేస్తారు. వెండిగ్ మెషిన్లో ఎంచుకున్న భాషను బట్టి ఆయా భాషలలో రసీదులు ప్రింట్ చేయబడతాయి.

Share.

About Author

Comments are closed.

scroll