Fake News, Telugu
 

పాత 2012 సిరియా వీడియోను ఇజ్రాయెల్ దేశంలో జరిగిన తాజా సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా ఎక్కువగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో అంత్యక్రియలు కోసం ఒక మృతదేహాన్ని మోసుకెళ్తున్న సమయంలో జరిగిన పేలుడు మనం చూస్తాము . ఈ పోస్టు క్యాప్షన్లు ఇలా చెప్తున్నాయి: “ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్టు మృతదేహంలో టైమ్ బాంబ్ పెట్టి, పాలస్తీనియన్లకు తిరిగి ఇచ్చింది. ఫలితం మీ ముందుంది. ఇది తగిన శాస్తి! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులను ఇలా అంతమొందించాలి. ఏ దేశంలో ఇలా చేసినా, ఆ దేశంలో వారి ఉగ్రవాద కార్యకలాపాలు వెంటనే ఆగిపోతాయి.” ఈ ఆర్టికల్ ద్వారా ఆ వీడియోలో నిజమెంతో తెలుసుకుందాం.

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్టు మృతదేహంలో టైమ్ బాంబ్ పెట్టి, దానిని పాలస్తీనియన్లకు తిరిగి ఇచ్చింది. ఆ పేలుడికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో జూలై 2012 నాటిది, సిరియాలోని డమాస్కస్ శివారులో ప్రభుత్వ దళాలచే చంపబడిన వ్యక్తి యొక్క అంత్యక్రియల ఊరేగింపు వీడియో ఇది. ప్రభుత్వ దళాలు పెట్టిన కారు బాంబు కారణంగా పేలుడు సంభవించిందని, దీని ఫలితంగా దాదాపు 85 మంది మరణించారని అప్పట్లో రిపోర్ట్ అయింది. ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిగిన ఘటనతో వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు .

వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఇది జూలై 2012లో ప్రచురించబడిన “ఫ్యూనరల్ అటాక్ ఇన్ సిరియా – క్లెయిమ్స్” అనే యూరో న్యూస్ వీడియో నుండి తీసుకున్నదని తెలుస్తుంది. ఈ వీడియో ఇటీవల జరిగిన సంఘటనది కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

వీడియో యొక్క వివరణ నుండి క్లూలను తీసుకొని, వెతికితే ఈ సంఘటనను వివరించే CNN ఆర్టికల్‌కు దారితీసింది. సీఎన్‌ఎన్ కథనం ప్రకారం, డమాస్కస్ నగరానికి సమీపంలో ప్రభుత్వ బలగాలచే చంపబడిన వ్యక్తి కోసం పెద్ద అంత్యక్రియల ఊరేగింపు వీడియోలో చూపబడింది. అతని శరీరం సిరియా విప్లవ జెండాతో కప్పబడింది, మరియు ఈ గుంపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ప్రభుత్వ దళాలు పెట్టిన కారు బాంబు కారణంగా పేలుడు జరిగింది, దీనిలో సుమారు 85 మంది మరణించినట్లు అంచనా.

18 ఆగస్టు 2024న, టెల్ అవీవ్‌లో జరిగిన బాంబు పేలుడులో ఒక వ్యక్తి మరణించాడు, మరియు ఒక ఆగంతకుడు గాయపడ్డాడు. హమాస్ మరియు పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కలిసి ఈ ఆత్మహుతి దాడికి బాధ్యత వహించారు. గాజా కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి నగరానికి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఈ పేలుడు జరిగింది.

చివరగా, పాత 2012 సిరియా వీడియోను ఇజ్రాయెల్ దేశంలో జరిగిన తాజా సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll