బీజేపీ ప్రభుత్వం పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఒక కోటి రూపాయిల ఆర్ధిక సహాయం చేయలేదు కానీ కుంభమేళ కోసం ఏకంగా 4 వేల కోట్లు ఖర్చు చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీ ప్రభుత్వం పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఒక కోటి రూపాయిల ఆర్ధిక సహాయం కూడా అందించలేదు.
ఫాక్ట్ (నిజం): 14 ఫిబ్రవరి 2019 నాడు పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సైనికుల కుటుంబాలకు ఆయా జవాన్లు తీసుకుంటున్న జీతాలనే పెన్షన్లుగా ఇస్తున్నామని, విరాళాలతో కలుపుకొని ప్రతి కుటుంబానికి 2.16 కోట్ల నుండి 3.24 కోట్ల వరకు ఆర్ధిక సహాయం అందజేశామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 14 ఫిబ్రవరి 2020 నాడు ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. పుల్వామా దాడిలో మరణించిన CRPF జవాన్ల కుటుంబాలకు పూర్తి పెన్షన్‌తో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలను మరియు పరిహారాన్ని అందించామని హోమ్ వ్యవహారాల శాఖ 2021లో పార్లమెంటుకి తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేసిన క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సైనికుల కుటుంబాలకు ఆర్ధిక పరిహారం చెల్లించలేదని మీడియాలో వచ్చిన కథానాల గురించి స్పష్టతనిస్తూ CRPF 14 ఫిబ్రవరి 2020 నాడు ఒక ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. 14 ఫిబ్రవరి 2019 నాడు పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలలో ఒక్కరికి తప్పితే మిగితా అన్నీ కుటుంబాలకి ఆర్ధిక పరిహారాన్ని అందజేసినట్టు CRPF ఈ ట్వీట్లో తెలిపింది. మృతి చెందిన CRPF జవాన్ల కుటుంబాలకు ఆయా జవాన్లు తీసుకున్న జీతాలనే పెన్షన్లుగా ఇస్తున్నామని, విరాళాలతో కలుపుకొని ప్రతి అమరవీరుడి కుటుంబానికి 2.16 కోట్ల నుండి 3.24 కోట్ల వరకు ఆర్ధిక సహాయం అందజేశామని CRPF ఈ ట్వీట్లో స్పష్టం చేసింది.
పుల్వామా దాడిలో మరణించిన CRPF జవాన్ల కుటుంబాలకు పూర్తి పెన్షన్‌తో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలను మరియు పరిహారాన్ని అందించామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ 2021లో పార్లమెంటుకి తెలిపింది. రూ. 35 లక్షల సెంట్రల్ ఎక్స్ గ్రేషియా, CRPF రిస్క్ ఫండ్ కింద రూ. 20 లక్షలు, SBI పారామిలీటరీ సేలరీ ప్యాకేజీ కింద రూ. 30 లక్షలతో సహా మరెన్నో ఆర్థిక ప్రయోజనాలను మరియు పరిహారాలను పుల్వామ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు అందజేసినట్టు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు హోం వ్యవహారాల శాఖ సమాధానమిస్తూ తెలిపింది.
ఇవి కాకుండా ప్రతి అమరవీరుడి కుటుంబానికి గుజరాత్ ప్రభుత్వం రూ. 10 లక్షలు, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు, సిక్కిం ప్రభుత్వం రూ. 3 లక్షలను ఆర్ధిక సహాయంగా అందించిందని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తన సమాధానంలో తెలిపింది. పుల్వామా దాడిలో మరణించిన రాష్ట్రానికి చెందిన 12 మంది జవాన్ల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 15 ఫీబ్రవరి 2019 నాడు ప్రకటించింది. 2019లో నిర్వహించిన కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4200 కోట్లు కేటాయించింది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఒక కోటి రూపాయిల ఆర్ధిక సహాయం కూడా అందచేయలేదని ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు.
చివరిగా, పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం ఆర్ధిక సహాయం కూడా అందించలేదని చేస్తున్న ఈ ప్రచారంలో నిజం లేదు.