వ్యవసాయ రుణాలను ఒకే విడతలో మాఫీ చేయడం అసాధ్యమని, తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. . ఒకే విడతలో రుణమాఫీ చెయ్యడం తమకి చేతకాదని సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారు అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. 3 ఆగస్టు 2023 నుండి తమ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ప్రారంభిస్తుందని సిఎం బుధవారం ప్రకటించిన (ఇక్కడ, ఇక్కడ) సందర్భంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని తనిఖీ చేద్దాం.
క్లెయిమ్: రైతు రుణాలను ఒకే విడతలో మాఫీ చేయడం తమ ప్రభుత్వం వల్ల చేతకాదు అని ఒప్పుకున్న సీఎం కేసీఆర్.
ఫాక్ట్(నిజం): రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విడతలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తన ప్రసంగంలో నిజంగానే పేర్కొన్నారు. కానీ ఇది 2019లో జరిగిన విషయం. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.
వైరల్ పోస్టులో ఉన్న ఈ క్లిప్, ETV వార్తా కథనానికి చెందినది అని గమనించిన తర్వాత, సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి దాని కోసం ఇంటర్నెట్‌లో వెతికాము. ఇదే విషయంపై ఫిబ్రవరి 2019 ETVలో వచ్చిన వార్త కథనానికి ఈ సెర్చ్ దారితీసింది.
ఈ కథనంలో, వ్యవసాయ రుణాలను ఒకే విడతలో మాఫీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సాధ్యం అవదు అని, అది కష్టమని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం చూడవచ్చు. అనంతరం ఇదే వీడియోలో, దొంగ అకౌంట్లు పుట్టించి డబ్బు కాజేసే వాళ్ళని అరికట్టడానికి, రైతులకు నేరుగా చెక్కు అందజేయాలని ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు. వీడియోలో చెప్తున్న విషయం వైరల్ క్లెయిమ్ ఒకటే అయినప్పటికీ, క్లెయిమ్ చేస్తున్నట్లు కేసీఆర్ ఈ ప్రకటన ఇటీవల చేసింది కాదు.
చివరిగా, వ్యవసాయ రుణాలను ఒకే విడతలో మాఫీ చేయడం సాధ్యం కాదని కేసీఆర్ చెబుతున్న ఈ వీడియో 2019 నాటిది.