Fake News, Telugu
 

మోదీ అయోధ్యలో ఇంటింటికీ తిరిగి రామాలయ ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రికను పంచారంటూ సంబంధంలేని వీడియోను షేర్ చేస్తున్నారు

0

అయోధ్యలో చిన్న చిన్న సందుల్లో సైతం రామాలయం పునః ప్రతిష్ట ఆహ్వాన పత్రికను ఇంటింటికీ పంచుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో ఇంటింటికీ తిరిగి రామాలయ ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఇటీవల మోదీ అయోధ్యలోని ఉజ్వల పథకం లబ్ధిదారులైన (10 కోట్లవ లబ్ధిదారు) మీరా అనే మహిళ ఇంటికి వెళ్లిన సందర్భానికి సంబంధించినది. కాగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్/ మోదీ గానీ అయోధ్యలోని అన్నీ ఇండ్లకి ఆహ్వానం అందించినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. వార్తా కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నగరంలోని వివిధ రంగాలకు చెందిన 80 మంది ప్రముఖులను శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించినట్టు తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వీడియోలో కనిపిస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ ఇటీవల అయోధ్యలోని వీధుల్లో తిరిగి ప్రజలను పలకరించిన విషయం నిజమే అయినప్పటికీ పోస్టులో చెప్తున్నట్టు మోదీ ఇలా చేసింది రామాలయ పునః ప్రతిష్ట ఆహ్వాన పత్రికను అందించడానికి కాదు. ఈ దృశ్యాలు మోదీ ఈ మధ్య అయోధ్యలో ఉజ్వల పథకం లబ్దిదారు ఇంటికి వెళ్లిన సందర్భానికి సంబంధించినవి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా మోదీ అయోధ్య వీధుల్లో తిరిగి ప్రజలను పలకరించిన సంఘటనను రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఇటీవల మోదీ అయోధ్య పర్యటనలో భాగంగా ఉజ్వల పథకం లబ్ధిదారులైన (10 కోట్లవ లబ్ధిదారు) మీరా అనే మహిళ ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం వైరల్ వీడియోలోని దృశ్యాలు ఆమె ఇంటినుండి మోదీ బయటికి వచ్చినప్పటివి. మోదీ ఆమె ఇంటిని సందర్శించిన వార్తను రిపోర్ట్ చేసిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

ఇదిలా ఉండగా మోదీ రామాలయ ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రికను పంచినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అయోధ్యలోని రామాలయ ప్రతిష్ఠాపన ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించే ఒక ప్రైవేటు కార్యక్రమం. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, కార్యక్రమ ఆహ్వానాలను ట్రస్ట్ పంచుతుంది.

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు ఆహ్వానించిన వార్త ఇక్కడ చూడొచ్చు. కాగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కూడా అయోధ్యలోని అన్నీ ఇండ్లకి ఆహ్వానం అందించినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. వార్తా కథనాల ప్రకారం 22 జనవరి 2023న అయోధ్యలో జరిగే రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నగరంలోని వివిధ రంగాలకు చెందిన 80 మంది ప్రముఖులను శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించినట్టు తెలిసింది.

ఇటీవల ప్రధానమంత్రి మోదీ అయోధ్యలో మాట్లాడుతూ  జనవరి 22 న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అంతా కోరుకుంటారని, కానీ అది అందరికీ సాధ్యపడదని తెలిపారు. ఆరోజు అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు నుండి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు.

చివరగా, మోదీ అయోధ్యలో ఇంటింటికి తిరిగి రామాలయ ప్రతిష్ఠాపన ఆహ్వాన పత్రికను పంచారంటూ సంబంధంలేని వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll