Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోలని అస్సాంలో ఇటీవల ముస్లింలు ఒక హిందూ మహిళను హత్య చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

అస్సాంలో మరొక శ్రద్ధ ఫ్రిజ్‌లో దొరికింది…లీవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తున్న కాజల్‌పై మొదట ఏడుగురు ముస్లిం అబ్బాయిలు అత్యాచారం చేసి, ఆపై చలి కారణంగా అపస్మారక స్థితిలో ఫ్రీజ్‌లో సజీవంగా ప్యాక్ చేయబడి ఆమె మరణించింది”, అంటూ చనిపోయి ఉన్న ఒక మహిళ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఢిల్లీలో ప్రియుడు ఆఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసు ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో, లవ్ జిహాద్ కోణంతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: శ్రద్ధ వాకర్ తరహాలో అస్సాంలో కాజల్ అనే అమ్మాయిని ఏడుగురు ముస్లిం అబ్బాయిలు అత్యాచారం చేసి, ఫ్రీజ్‌లో సజీవంగా ప్యాక్ చేసి చంపేశారు.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసిన ఫోటోలను ఒక పోర్చుగీస్ బ్లాగ్ సైట్ 2010లో పబ్లిష్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ ఫోటోలు పాతవి అని, తప్పుడు సమాచారంతో ఈ ఫోటోలని షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం పోలీసులు ఇటీవల ట్వీట్ ద్వారా స్పష్టం కూడా చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ పలు బ్లాగ్ సైట్లు 2010లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఒసాస్కోకు చెందిన ఒక వ్యక్తి తన భార్యను చంపేసి శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిందని ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఒక బ్లాగ్ సైట్ అప్పుడు తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ పోస్టులకి సంబంధించి అస్సాం పోలీసులు 08 డిసెంబర్ 2022 నాడు ఒక ట్వీట్ పెట్టారు. 2010లో ఒక పోర్చుగీస్ బ్లాగ్ పబ్లిష్ చేసిన ఫోటోలని తప్పుడు కథనాలను జత చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ చేస్తున్నారని అస్సాం పోలీసులు తమ ట్వీట్లో స్పష్టం చేశారు. ఈ మెసేజిలను షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం పోలీసులు తమ ట్వీట్లో హెచ్చరించారు.

అస్సాం పోలీసులు ఈ ఫోటోలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ కూడా చేశాయి. శ్రద్ధా హత్య తరువాత అస్సాంలో ఇటీవల కాజల్ అనే అమ్మాయిని ఏడుగురు ముస్లింలు అత్యాచారం చేసి, చంపేసి,  శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. అసలు అటువంటి సంఘటన అస్సాంలో జరిగినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. పోస్టులో షేర్ చేసిన ఫోటోలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ అవి పాతవి అని, అసలు భారత దేశానికి సంబంధించినవి కాదని చెప్పొచ్చు.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోలని శ్రద్ధ వాకర్ తరహాలో అస్సాంలోని హిందూ మహిళను ముస్లింలు చేసి శవాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన దృశ్యలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll