కమలం గుర్తు కలిగిన నాణెం ఒకటి చూపిస్తూ ‘ఈ నాణెం బీజేపి ప్రవేశపెట్టింది కాదు, 1616 లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన రెండు అణాల నాణెం’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టును విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 1616 లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కమలం గుర్తు కలిగిన రెండు అణాల నాణెం ఫోటో.
ఫాక్ట్(నిజం): బ్రిటిష్ ప్రభుత్వం కమలం గుర్తు కలిగి ఉన్న నాణెం ముద్రించినట్టు ఎటువంటి ఆధారం లేదు. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదట 1717లో నాణేలు ముద్రించేందుకు ముఘల్ చక్రవర్తి ఫరూక్సియార్ నుండి అనుమతి పొంది ముంబైలో ఆంగ్ల నమూనా నాణేలు ముద్రించటం మొదలు పెట్టారు. కానీ, అధికారికంగా బ్రిటిష్ ప్రభుత్వం 1835 నుండ నాణేలను ముద్రించినది. అంటే, 1616లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నాణెం ముద్రించే అవకాశం లేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
స్వాతంత్రం వచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన నాణాల వివరాలు కనుక్కోవటానికి RBI వెబ్సైట్‌లోని మ్యూజియం సెక్షన్‌లో వెతికితే పోస్టులో షేర్ చేసినటువంటి నాణెం ఏదీ మాకు కనిపించలేదు. పైగా, ఈ వెబ్సైట్‌లో బ్రిటిష్ నాణేల చరిత్ర గురించి అందుబాటులో ఉన్న సమాచారం పరకారం, క్రీ.శ. 1717లో ఆంగ్లేయులు బొంబాయి మింట్‌లో నాణాలు ముద్రించటానికి ముఘల్ చక్రవర్తి ఫరూక్సియార్ నుండి అనుమతి పొందారు. అక్కడ ఆంగ్ల నమూనా నాణేలు ముద్రించబడ్డాయి అని తెలుసుకున్నాం. అయితే, క్రీ.శ. 1717లో నాణేలు ముద్రించేందుకు అనుమతి పొందినప్పటికీ బ్రిటీష్ అధికారులు 1835లో మాత్రమే నాణేల చట్టం, 1835 ద్వారా నాణేల ముద్రణకు సంబంధించిన చట్టాన్ని తెచ్చారు.
భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్య పాలనలో విడుదలైన నాణేలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ నాణేల్లో దేనిపైనా కమలం గుర్తు లేదు.
కాయిన్‌క్వెస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క శాసనం మరియు 1616, 1717, 1818 వంటి తేదీలతో కూడిన రాగి నాణేలు ఎక్కువగా ‘ఆధ్యాత్మిక ఆధారిత టోకెన్‌గా ఇటీవల తయారు చేయబడ్డాయి మరియు పర్యాటకులకు విక్రయించబడ్డాయి….ఇవి పాత మరియు విలువైనదిగా కనిపించేలా రూపొందించిన నకిలీ నాణేలు.‘
చివరిగా, 1616లో బ్రిటిష్ ప్రభుత్వం కమలం గుర్తు కలిగిన నాణేలను ముద్రించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.