Fake News, Telugu
 

బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు అల్లర్లు చేస్తున్నారని సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA) కూటమి 293 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 240 సీట్లను మాత్రమే పొందింది. ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్ల అవసరం ఉంటుంది. కానీ,  బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ కూటమి భాగస్వాములతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 5 జూన్ 2024న NDA సమావేశానికి హాజరై తాము NDAకే  మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పోస్టర్ ని కొంతమంది తగలబెడుతున్న ఒక వీడియోను (ఇక్కడ,ఇక్కడ, మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు అల్లకల్లోలం చేస్తున్నారని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరుకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు చంద్రబాబు నాయుడుకు నిరసనగా ఆయన పోస్టర్ ని తగలబెడుతున్న వీడియో.  

ఫాక్ట్ (నిజం): వైరల్ వీడియోలో ఉన్న సంఘటన మార్చి 2024లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై టీడీపీ అనుచరుల నిరసనకు సంబంధించింది. టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌ను ప్రకటించింది. అయితే, ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జితేందర్‌ గౌడ్‌ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయారు. జితేందర్‌ గౌడ్‌ అనుచరులు గుంతకల్‌లోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌, కిటికీలు ధ్వంసం చేసి, చంద్రబాబు నాయుడు ఫొటోలు, బ్యానర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కావున, పోస్టులోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని ఇంటర్నెట్ లో  వెతికితే ఇదే విజువల్స్ తో  ఉన్న ఒక  వీడియో (ఆర్కైవ్) లభించింది. ఈ వీడియోని 30 మార్చ్ 2024న NTV తమ యూట్యూబ్ ఛానల్ లో ప్రచురించింది. వీడియో కింద శీర్షికలో ‘ఫైనల్ లిస్ట్ పై అనంతపూర్ టీడీపీ నాయకుల నిరసన’ అని ఇంగ్లీషులో పేర్కొని ఉంది. ఈ వీడియోలోని కథనం ప్రకారం గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌ను టీడీపీ ప్రకటించింది. అయితే, ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జితేందర్‌ గౌడ్‌ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయారు. జితేందర్‌ గౌడ్‌ అనుచరులు గుంతకల్‌లోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌, కిటికీలు ధ్వంసం చేసి, చంద్రబాబు నాయుడు ఫొటోలు, బ్యానర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అదే సమయంలో అనంతపురంలో కూడా టీడీపీ క్యాడర్ ఇదే తరహాలో విధ్వంసానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. 

వైరల్ వీడియో విజువల్స్ ని, న్యూస్ వీడియోలో ఉన్న విజువల్స్ తో పోల్చి చూస్తే ఈ రెండు విజువల్స్  ఒకే సంఘటనకు సంబంధించినవని అర్ధం అవుతుంది. దీనిని బట్టి, వైరల్ వీడియోలోని సంఘటన  గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికను నిరసిస్తూ గుంతకల్ టీడీపీ అనుచరులు మార్చ్ 2024లో, అంటే 20224 అసెంబ్లీ ఎన్నికల ముందు జరిపిన నిరసనకు సంబంధించిన సంఘటన అని స్పష్టం అవుతుంది.  

చివరగా, బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు అల్లర్లు చేస్తున్నారని సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll