Fake News, Telugu
 

వక్ఫ్ బోర్డు సభ్యులనే కాదు, ఆలయాల ఎండోమెంట్ (దేవస్థాన) బోర్డు సభ్యులను కూడా పబ్లిక్ సర్వెంట్స్‌గా పరిగణిస్తారు

0

“కాంగ్రెస్‌ తెచ్చిన వక్ఫ్‌యాక్ట్ 1995 సెక్షన్ 101 ప్రకారం వక్ఫ్‌బోర్డ్ సభ్యులు పబ్లిక్ సర్వెంట్స్‌గా గా పరిగణించబడతారు, వాళ్లని టచ్ చేసినా IPC సెక్షన్ 27 ప్రకారం నేరం అని, ఏ ఆలయ పూజారి లేదా పీఠాధిపతికి ఇలాంటి విశేషాధికారం లేదు”, అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 101 ప్రకారం, బోర్డు సభ్యులను పబ్లిక్ సర్వెంట్స్‌గా పరిగణిస్తారు. వాళ్లకు ఐపీసీ సెక్షన్ 27 ప్రకారం సంరక్షణ లభిస్తుంది. ఇటువంటి అధికారం ఏ ఆలయ బోర్డ్ సభ్యులకు లేదు.

ఫాక్ట్ : వక్ఫ్ బోర్డు సభ్యులనే కాదు, ఆలయాల ఎండోమెంట్ (దేవస్థాన) బోర్డు సభ్యులను కూడా ప్రభుత్వ సేవకులుగా (పబ్లిక్ సర్వెంట్స్‌గా) పరిగణిస్తారు. ఐపీసీ సెక్షన్ 27 పబ్లిక్ సర్వెంట్స్‌ గురించి చర్చించదు. కావున, ఈ పోస్టులోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 101 ప్రకారం వక్ఫ్ సర్వే కమీషనర్, బోర్డు సభ్యులు, అధికారులు పబ్లిక్ సర్వెంట్స్‌గా పరిగణించబడతారు. కానీ, ఐపీసీ సెక్షన్ 27 పబ్లిక్ సర్వెంట్స్‌ సంరక్షణ గురించి చర్చించదు. ఇది ఆస్తి హక్కులను రక్షించడంలో, నేరాలను నిరోధించడం గురించి మరియు ఇతరుల ఆస్తికి బాధ్యత వహించే వ్యక్తులు వారి చర్యలకు జవాబుదారీగా ఉండటం గురించి చర్చిస్తుంది.

ఇకపోతే, IPC సెక్షన్ 152, సెక్షన్ 353 విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై (పబ్లిక్ సర్వెంట్స్‌పై) భౌతికంగా దాడి చేయడం లేదా బలం ప్రయోగించడం లేదా వారి పని వారు చేయకుండా ఆపడానికి ప్రయత్నించడం వంటి వాటికి శిక్షల గురుంచి చర్చిస్తుంది.

అంతే కాదు,  పలు రాష్ట్రాల దేవస్థానం (ఎండోమెంట్) చట్టాలను పరిశీలించగా, ఈ చట్టాల ప్రకారం దేవస్థానం యొక్క ధర్మకర్త లేదా ధర్మకర్తల మండలిలోని అధికారుడు, సభ్యుడు లేదా ఆఫీస్ హోల్డర్ లేదా ఎండోమెంట్ యొక్క సేవకున్ని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21 ప్రకారం “పబ్లిక్ సర్వెంట్స్‌” గా పరిగణించబడతారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) అని తెలిసింది.

చివరిగా, వక్ఫ్ బోర్డు సభ్యులనే కాదు, ఆలయాల ఎండోమెంట్ (దేవస్థాన) బోర్డు సభ్యులను కూడా పబ్లిక్ సర్వెంట్స్‌గా పరిగణిస్తారు.

Share.

About Author

Comments are closed.

scroll