ఒకే అమ్మాయికి చెందినవిగా క్లెయిమ్ చేయబడుతున్న రెండు ఫొటోల కొలాజ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎడమ వైపున ఉన్న ఫోటోలో హిజాబ్ ధరించిన అమ్మాయి ఉండగా, కుడి వైపున ఉన్న ఫోటోలో జీన్స్ మరియు హూడీ ధరించిన ఒక మహిళ ఉంది. జీన్స్ మరియు హూడీలో ఉన్న మహిళ బీబీ ముస్కాన్ ఖాన్ అని దానితో పాటుగా ఉన్న వివరణ సూచిస్తుంది, గత సంవత్సరం కర్ణాటకలో హిజాబ్ వివాదం సమయంలో తను హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించిన ఒక యువకుల గుంపును ముస్కాన్ ఎదుర్కొంది (ఇక్కడ మరియ ఇక్కడ). ‘ఇక్కడ హిజాబ్ తో..విదేశాల్లో జీన్స్ T షర్ట్ తో..ఇక్కడ మత ఘర్షణలు పెంచాలని వాళ్లు చేసిన కుట్ర ఈ హిజాబ్ ఆందోళనలు..’ అని ఈ ఫోటోని షేర్ చేసిన పోస్టు వివరణలో ఉంది. ఈ కథనం ద్వారా ఈ పోస్టు వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో పరిశీలిద్దాం.
క్లెయిమ్: ఫోటోలో జీన్స్ మరియు హూడీ ధరించిన మహిళ కర్ణాటక హిజాబ్ నిరసనకారురాలు ముస్కాన్ ఖాన్.
ఫాక్ట్(నిజం): ఈ కోలాజ్‌లో ఇద్దరు వేర్వేరు మహిళల ఫోటోలు ఉన్నాయి. ఎడమవైపు ఉన్న వ్యక్తి ముస్కాన్ ఖాన్ అయితే, కుడి వైపున ఉన్న ఫోటో RJ సయేమాకు చెందినది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
జీన్స్ మరియు హూడీలో ఉన్న మహిళ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది ప్రముఖ రేడియో జాకీ అయిన RJ సయేమాకు చెందిన ఫోటో అని తెలిసింది. సయేమా 6 జూన్ 2023న “లండన్ ఈజ్ బ్యూటిఫుల్” అనే శీర్షికతో కొన్ని చిత్రాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంట్లో ఉన్న మొదటి ఫోటో వైరల్ అవుతున్న కోలాజ్‌లో కుడి వైపు ఉన్న ఫోటో ఒకటే. జీన్స్ మరియు హూడీలో ఉన్న మహిళ RJ సయేమా అని, ముస్కాన్ ఖాన్ కాదని ఇది నిర్ధారిస్తుంది.
ముస్కాన్ ఖాన్ కర్ణాటకలో హిజాబ్ వివాద సమయంలో పాపులర్ అయింది. అయితే, గతంలో తను మరణించినట్లు ఒక తప్పుడు వార్త సోషల్ మీడియాలో ప్రచురించబడింది. ఆ సమయంలో అది తప్పుడు సమాచారమని మేము ఒక ఆర్టికల్ ప్రచురించాము.
మొత్తానికి, జీన్స్ మరియు హూడీలో ఉన్న మహిళ కర్ణాటక హిజాబ్ నిరసనకారురాలు అయిన ముస్కాన్ ఖాన్ కాదు.