Fake News, Telugu
 

ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్న ఈ పేపర్ క్లిప్పింగ్ డిజిటల్ గా తయారు చేయబడింది

0

‘కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్, రైతు బంధు దిక్కుమాలిన పథకాలు’ అని ఈటల రాజేందర్ అన్నట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన క్లిప్ ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్, రైతు బంధు దిక్కుమాలిన పథకాలు’ అని ఈటల రాజేందర్ అన్నట్టు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త క్లిప్.

ఫాక్ట్ (నిజం): 02 జూలై 2021 ఆంధ్రజ్యోతి పత్రికలోని పేజీ 2లో ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ పురస్కారాలకు’ సంబంధించిన ఒక కథనం ప్రచురించారు. ఈ కథనం యొక్క క్లిప్ ని డిజిటల్ గా ఎడిట్ చేసి దాని స్థానంలో ఈటల రాజేందర్ ప్రభుత్వ పతకాలను విమర్శిస్తున్నట్టు ఉండే ఒక క్లిప్ ని తయారు చేసారు. పైగా ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని పత్రిక క్లిప్ లో ఉన్న తేది ఆధారంగా 02 జూలై 2021 ఆంధ్రజ్యోతి పత్రిక వెతకగా, ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆ రోజు పత్రికలో ఎలాంటి కథనం రాయలేదు. ఐతే పోస్టులో పత్రిక క్లిప్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ క్లిప్ లో ఈటల రాజేందర్ కథనం పక్కకు ఒక కార్టూన్ మరియు ఈటల రాజేందర్ కథనం కింద ఒక గోపురం లాంటి ఆకారంతో పాటు కొన్ని అక్షరాలు ఉన్నట్టు చూడొచ్చు.

వీటి ఆధారంగా వెతకగా 02 జూలై 2021 ఆంధ్రజ్యోతి పత్రికలోని పేజీ 2లో ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ పురస్కారాలకు’ సంబంధించిన ఒక కథనం మాకు కనిపించింది. ఐతే ఈ కథనం పక్కకు అచ్చం పోస్టులోని ఈటల క్లిప్ లాగే ఒక కార్టూన్ మరియు కింద ఒక గోపురం లాంటి ఆకారంతో పాటు కొన్ని అక్షరాలు ఉండడం గమనించొచ్చు.

ఐతే పోస్టులోని ఈటల క్లిప్ ని మరియు ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ పురస్కారాలకు’ సంబంధించిన క్లిప్ పోల్చి చూసినప్పుడు, 02 జూలై 2021 ఆంధ్రజ్యోతి పత్రికలోని పేజీ 2లో ప్రచురించిన ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ పురస్కారాల’ క్లిప్ ని డిజిటల్ గా ఎడిట్ చేసి దాని ఆధారంగా ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్న క్లిప్ ని తయారు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.

ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే వార్తా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించేవి, కాని ఇటీవల కాలంలో ఈటల ఇలా అన్నట్టు ఎటువంటి వార్తా కథనాలు గానీ వీడియోలు గానీ లేవు.

చివరగా, ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్న ఈ పత్రిక క్లిప్ డిజిటల్ గా తయారు చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll