Fake News, Telugu
 

అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు 2020లోనే తీర్పు ఇచ్చింది

0

కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాదని అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను ట్రావెన్‌కోర్ రాజ కుటుంబీకులకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ప్రకటించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు ప్రకటించిన తరువాత ట్రావెన్‌కోర్ కిరీట యువరాజు ఆదిత్య వర్మ తన ఆనందాన్ని తన తల్లితో పంచుకుంటున్న దృశ్యాలంటూ ఒక ఫోటోని ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. బీజేపీ నేత మరియు ప్రముఖ న్యాయవాధీ సుబ్రమణ్యన్ స్వామి ఈ కేసుని వాధించి ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలు వచ్చేలా చేశారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): ట్రావెన్‌కోర్ రాజ కుటుంబికులకు అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను అప్పగిస్తూ సుప్రీంకోర్టు 13 జులై 2020 నాడు తీర్పు ప్రకటించింది. ఆలయ నిర్వాహణ కోసం తిరువనంతపురం జిల్లా జడ్జ్ నేతృత్వంలోని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తమ తీర్పులో ఆదేశించింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వాహణ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేరళ హైకోర్టు 2011లో ఇచ్చిన తీర్పుని కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు 2020 జనవరి నెలలో ఈ తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు వెలువడిన తరువాత ట్రావెన్‌కోర్ వంశస్థులు భావోద్వేగానికి గురైన ఫోటోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఈ తీర్పు ఇటీవల వెలువడవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ట్రావెన్‌కోర్ రాజ కుటుంబీకులను అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిందని పలు వార్తా సంస్థలు 13 జులై 2023 నాడు రిపోర్ట్ చేసినట్టు తెలిసింది.

ట్రావెన్‌కోర్ రాజ కుటుంబమే ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తుందని, దేవాలయ నిర్వాహణ భాద్యతలను ట్రావెన్‌కోర్ వంశస్తులే చూసుకుంటుందని సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పింది. ట్రావెన్‌కోర్ రాజవంశం చివరి పాలకుడు చిత్ర తిరునాళ్ బలరామ వర్మ మరణించడం వలన అనంత పద్మనాభ స్వామి ఆలయంపై ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి ఉన్న అధికారాలను ఏ విధంగా కూడా ప్రభావితం చేయవని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. ఆలయ నిర్వాహణ కోసం తిరువనంతపురం జిల్లా జడ్జ్ నేతృత్వంలోని ఒక కమిటిని కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తమ తీర్పులో ఆదేశించింది.

1991లో ట్రావెన్‌కోర్ రాజవంశం చివరి పాలకుడు చిత్ర తిరునాళ్ బలరామ వర్మ చనిపోవడంతో ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి ఆలయంపై ఉన్న హక్కులు నిలిచిపోయాయని, అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వాహణ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వానికి కేరళ హైకోర్టు 2011 జనవరి నెలలో ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజ కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కేరళ ప్రభుత్వానికి ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి మధ్య జరిగిన ఈ వివాదంలో సుప్రీంకోర్టు ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా 2020 జులై నెలలో ఈ తీర్పు ఇచ్చింది.

2020లో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ప్రకటించిన తరువాత ట్రావెన్‌కోర్ రాజ వంశస్థులు ఆదిత్య వర్మ, తిరునాళ్ గౌరి లక్ష్మీ భాయ్ భావోద్వేగానికి గురైన దృశ్యాన్ని పోస్టులో షేర్ చేశారు. 2012లో అనంత పద్మనాభ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి సీనియర్ అడ్వొకేట్ గోపాల్ సుబ్రమణీయమ్ కొన్ని సూచనలు ఇచ్చినట్టు సుప్రీంకోర్టు తమ తీర్పులో తెలిపింది. బీజేపీ నాయకుడు సుబ్రమణీయన్ స్వామి ఈ కేసులో వాధించినట్టు ఈ తీర్పులో ఎక్కడా తెలుపలేదు.

2021లో ఒక కేసుకి సంబంధించి ఆనంత పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్ (1989-90 నుంచి 2013-14 వరకూ) ఖాతాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మళ్ళీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలకు సంబంధించి ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి వ్యతిరకంగా లేదా అనుకులంగా సుప్రీంకోర్టు మరే తీర్పు ఇవ్వలేదు.

చివరగా, అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు 2020లోనే తీర్పు ఇచ్చింది.

Share.

About Author

Comments are closed.

scroll