Coronavirus Telugu, Fake News, Telugu
 

భారత్ లో తీసిన ఈ ఆక్సిజన్ టాంకర్ల వీడియోకీ, సౌదీ అరేబియా లేదా పాకిస్థాన్ కి సంబంధంలేదు

0

సౌదీ అరేబియా నుంచి ఇండియాకు చేరుకున్న ఆక్సిజన్’, అని చెప్తూ టాంకర్లతో వెళ్తున్న రైలు వీడియోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. కోవిడ్-19 చికిత్స కి సంబంధించి దేశంలో ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం ఉన్న సందర్భంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సౌదీ అరేబియా నుంచి ఇండియాకు చేరుకున్న ఆక్సిజన్ టాంకర్లకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఉన్నవి ఖాళీ టాంకర్లు. వాటిలో ‘లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్’ ని నింపడానికి ముంబై నుండి విశాఖపట్నం కి పంపిస్తున్నారు. సౌదీ అరేబియా నుండి 80 MT లిక్విడ్ ఆక్సిజన్ పంపించినట్టు, భారతదేశానికి తగిన మద్దతు ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్టు తెలిసింది. కానీ, పోస్ట్ లోని వీడియోకీ, సౌదీ అరేబియా లేదా పాకిస్థాన్ కి సంబంధంలేదు. కావున, వివిధ పోస్టుల్లో వీడియోని సౌదీ అరేబియా మరియు పాకిస్థాన్ కి ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని వివిధ వార్తాసంస్థలు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ‘ANI News’ వారు వీడియోని 19 ఏప్రిల్ 2021 న పోస్ట్ చేసి, ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు ముంబై నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు బయలుదేరింది’ అని ఆంగ్ల బాషలో  టైటిల్ పెట్టారు. ఇదే విషయం చెప్తూ, ‘సెంట్రల్ రైల్వే’ మరియు ‘పియూష్ గోయల్’ (రైల్వే శాఖ మంత్రి) వారు కూడా అదే వీడియోని 19 ఏప్రిల్ 2021 న ట్వీట్ చేసారు. వీడియోలోఉన్నవి ఖాళీ టాంకర్లు, వాటిలో ‘లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్’ ని నింపడానికి విశాఖపట్నం కి పంపిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

అదానీ గ్రూప్ మరియు M/s లిండే వారి భాగస్వామ్యంతో సౌదీ అరేబియా నుండి 80 MT లిక్విడ్ ఆక్సిజన్ ని రవాణా చేస్తున్నట్టు సౌదీ అరేబియా లోని భారత రాయబార కార్యాలయం వారు 24 ఏప్రిల్ 2021 న ట్వీట్ చేసారు. సౌదీ అరేబియా నుంచి ఇండియాకు ఆక్సిజన్ వస్తున్న మాట వాస్తవమే అయినా, పోస్ట్ లోని వీడియో దానికి సంబంధించింది కాదు.

భారత్ కు పాకిస్థాన్ పంపిస్తున్న ఆక్సిజన్ కి సంబంధించిన వీడియోలు?

పోస్ట్ లోని వీడియోని కొందరు భారత్ కు పాకిస్థాన్ పంపిస్తున్న ఆక్సిజన్ కి సంబంధించిన వీడియో (ఆర్కైవ్డ్) అని కూడా షేర్ చేస్తున్నారు. కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి భారతదేశానికి తగిన మద్దతు ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్టు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. కానీ, పోస్ట్ లోని వీడియో మాత్రం పాకిస్థాన్ కి సంబంధించింది కాదు.

ఇంతకముందు, మరో వీడియో కూడా ఇలాంటి క్లెయిమ్ తోనే కొందరు షేర్ చేసినప్పుడు, అది ఒక పాత వీడియో అని చెప్తూ, FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, పోస్ట్ లోని ఆక్సిజన్ టాంకర్ల వీడియోకీ, సౌదీ అరేబియా లేదా పాకిస్థాన్ కి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll