Fake News, Telugu
 

వరద ప్రవాహంలో ఎడ్లబండి కొట్టుకుపోతున్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో కాదు

0

బంగారు తెలంగాణాలో కొట్టుకుపోతున్న పేదల బతుకులు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరద ప్రవాహం మీదుగా వెళ్తున్న ఒక ఎడ్లబండి, ఆ ప్రవాహం దాటికి కొట్టుకుపోతున్న దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. దీనితో ఆ బండిని నడిపిస్తున్న ఎద్దులు అలాగే, ఆ బండిలో కూర్చున్న మనుషులు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన తెలంగాణలో జరిగిందంటూ చేస్తున్న పోస్టులోని ఈ క్లెయిమ్ ఎంతవరకు నిజమో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణలోని వరద ప్రవాహంలో ఒక ఎడ్లబండి, అందులో కూర్చున్న మనుషులు కొట్టుకుపోతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఆ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నగర సమీపంలో జరిగింది. వీడియోలోని ఈ ఘటన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలని షేర్ చేస్తూ ‘TV9 Kannada’ న్యూస్ ఛానల్ ‘1 అక్టోబర్ 2020’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో దొరికింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నగర సమీపంలోని ఒక గ్రామంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎడ్లబండి అంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు. ఎడ్లబండితో సహా కొట్టుకుపోతున్న మనుషలని అక్కడే ఉన్న జనాలు కాపాడినట్టు ఈ వీడియోలో పేర్కొన్నారు.ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘Public Tv’ వారు కూడా ఈ ఘటన కర్ణాటక లోని రాయచూరు సమీపంలో జరిగిందని తెలుపుతూ యూట్యూబ్ లో పోస్ట్ చేసారు.

ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘Praja Vani’ న్యూస్ వెబ్ సైట్ ‘1 అక్టోబర్ 2020’పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఈ వివారాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో తెలంగాణకి సంబందించినది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, వరద ప్రవాహంలో ఒక ఎడ్లబండి అందులో కూర్చున్న మనుషులు కొట్టుకుపోతున్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll