ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాలు 24 ఫిబ్రవరి 2025న మొదలైనవి. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా YSRCP సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత పోడియం వద్దకు వెళ్లిన YSRCP సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతూ నినాదాలు చేశారు, తరువాత కాసేపటికే జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసారు. మీడియా కథనాల ప్రకారం, తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. ఈ బీఏసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 21 మార్చి 2025 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 28 ఫిబ్రవరి 2025న 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెడతారని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, “ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో YSRCP ఎమ్మెల్యేలకు 11వ నంబర్ బ్లాక్‌లో సీట్లు కేటాయించబడ్డాయి” అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాల్లో YSRCP ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోని బ్లాక్ నంబర్ 11లో సీట్లు కేటాయించబడ్డాయి.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేసినది. వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాల్లో YSRCP ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోని బ్లాక్ నంబర్ 12లో సీట్లు కేటాయించబడ్డాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాల గురించి రిపోర్ట్ చేస్తూ ఇలాంటి దృశ్యాలనే చూపిస్తున్న ఫోటోతో కూడిన పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాలల్లో ఉన్న ఫోటోను మనం గమనిస్తే, మాజీ సీఎం జగన్ సహా YSRCP ఎమ్మెల్యేలు బ్లాక్ నంబర్ 12లో ఉన్న సీట్లలలో కూర్చోవడం మనం చూడవచ్చు.

తదుపరి మేము యూట్యూబ్‌లో తగిన కీవర్డ్స్ ఉపయోగించి ‘ABN Telugu’ యూట్యూబ్ ఛానల్లో 24 ఫిబ్రవరి 2025న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని పరిశీలించాము (ఇక్కడ). ఇందులో కూడా మాజీ సీఎం జగన్ సహా YSRCP ఎమ్మెల్యేలు బ్లాక్ నంబర్ 12లో ఉన్న సీట్లలలో కూర్చోవడం మనం చూడవచ్చు.
దీన్ని బట్టి మాజీ సీఎం జగన్ సహా YSRCP ఎమ్మెల్యేలు బ్లాక్ నంబర్ 12లో కూర్చున్న ఒరిజినల్ ఫోటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారని మనం నిర్ధారించవచ్చు. వైరల్ ఫోటో మరియు అసలైన (Original) ఫోటో మధ్య పోలికను క్రింద చూడవచ్చు.

చివరగా, ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేసినది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాల్లో YSRCP ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోని బ్లాక్ నంబర్ 12లో సీట్లు కేటాయించబడ్డాయి.