అక్షయ్ కుమార్, రామ్ చరణ్, రణవీర్ సింగ్, తమన్నా భాటియా, సల్మాన్ ఖాన్ వంటి తదితర బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు అని చెప్తూ, వారు కాషాయ దుస్తులు వేసుకొని నీటిలో స్నానం చేస్తున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). అసలు ఈ ఫొటోల వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ వంటి పలు సెలెబ్రిటీలు 2025 మహా కుంభమేళాలో పాల్గొన్న దృశ్యాలు.
ఫ్యాక్ట్(నిజం): ఈ పోస్టులో పేర్కొన్న వారెవరూ కుంభమేళాలో పాల్గొన్నట్లుగా వార్తా కథనాలు లేవు. ఈ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కడా కూడా వారు 2025 మేళాలో పాల్గొన్నట్లు సమాచారం లేదు. వైరల్ అవుతున్న ఫోటోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినవి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ ఫోటోలలో కనిపిస్తున్న సెలెబ్రిటీలు 2025 మహా కుంభమేళాలో పాల్గొన్నట్లు మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. అలాగే వైరల్ అవుతున్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఈ ఫోటోలతో కూడిన విశ్వసనీయ వార్తా కథనాలు కూడా మాకు లభించలేదు.
అదనంగా, ఫోటోలలో ఉన్న సెలబ్రిటీల సోషల్ మీడియా ప్రొఫైళ్లలో వెతకగా, అక్కడ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కూడా మాకు ఈ ఫోటోలు లభించలేదు. ఈ ఫోటోలను గమనిస్తే, రాజపాల్ యాదవ్, పంకజ్ త్రిపాఠి ఉన్న ఫొటోలో, రాజ్‌పాల్ యాదవ్ వేలు టీ కప్పులో ఉన్నట్టు ఉండడం మాకు కనిపించింది. ఇలాంటి తప్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన చిత్రాల్లో ఉంటాయి.

అంచేత, ఈ ఫోటోలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినవేమో అనే అనుమానంతో, దాన్ని వెరిఫై చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ డిటెక్షన్ టూల్స్ అయిన హైవ్ మరియు సైట్ ఇంజన్ వంటి టూల్స్ ఉపయోగించి వెతికాము. ఈ టూల్స్ చేసిన ఎనాలిసిస్ ప్రకారం, వైరల్ అవుతున్న ఫోటోలు అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినవే(ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు).

అలాగే, వైరల్ ఫోటోలలో ఏబీపీ లైవ్ అని ఒక లోగో ఉండటం గమనించి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ చిత్రాలు అన్నిటినీ ఏబీపీ న్యూస్ వారు తయారు చేశారు అని మాకు అర్థం అయ్యింది. 2025 మహా కుంభమేళాలో ఒకవేళ సెలబ్రెటీలు పాల్గొంటే ఎలా ఉంటుందో ఊహించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ చిత్రాలను వారు తయారు చేశారు అని చెప్తూ ఏబీపీ లైవ్ టీవీ వారు ఇన్స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ (ఆర్కైవ్ లింక్)చేశారు.
అయితే, వైరల్ ఫోటోల గురించి ఇంటర్నెట్లో వెతుకుతున్న సమయంలో, నటుడు రాజ్‌పాల్ యాదవ్ డిసెంబర్ 2024లో జనవరి 2025 మొదట్లో ప్రయాగ్‌రాజ్ వెళ్లినట్లు కొన్ని వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి. కానీ, ఇవన్నీ 13 జనవరి 2025న మహా కుంభమేళా మొదలవక ముందు కథనాలు.
చివరిగా, 2025 మహా కుంభమేళాలో సినీ నటులు పాల్గొన్నారు అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన చిత్రాలను షేర్ చేస్తున్నారు.