Update (02 July 2022)
మహారాష్ట్ర కూడా ఏప్రిల్ 2022 నుండి ‘బ్లడ్ ఆన్ కాల్’ సేవలు ఆపేసింది. ఆర్థికంగా ఆచరణీయం కాదు అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి.
దేశంలో రక్త అవసరాలు తీర్చేందుకు భారత ప్రభుత్వం 104 హెల్ప్ లైన్ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సేవని మొదలుపెట్టినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేస్తే నలబై కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకి నాలుగు గంటలలో రక్తం అందిస్తారని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: దేశంలో రక్త అవసరాలు తీర్చేందుకు భారత ప్రభుత్వం 104 హెల్ప్ లైన్ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సేవని మొదలుపెట్టింది.
ఫాక్ట్ (నిజం): 104 హెల్ప్ లైన్ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సర్వీసుని మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోంది. ఈ సర్వీసు భారత దేశం అంతట అమలు చేయలేదు. వివిధ రాష్ట్రాలలో ఈ 104 హెల్ప్ లైన్ నెంబర్ ని ఇతర సేవలకు వాడుతున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్న ‘బ్లడ్ ఆన్ కాల్’(104) సర్విసుల గురించి గూగుల్ లో వెతికితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జనవరి 2014లో మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ సర్వీసుకి సంబంధించిన వివరాలను తెలుపుతూ 2014లో ‘The Times of India’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని మనం మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు వెబ్సైటులో కూడా చూడవచ్చు. ఈ 104 నెంబర్ ని మహారాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సేవలకి కూడా హెల్ప్ లైన్ నెంబర్ గా ఉపయోగించుకుంటుంది. అంతేకాదు, ఈ 104 అనే నెంబర్ ని వివిధ రాష్ట్రాలు ఇతర సేవలకి హెల్ప్ లైన్ నెంబర్ గా ఉపయోగించుకుంటున్నారు. భారత ప్రభుత్వం 104 టోల్ ఫ్రీ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ సేవలను మొదలుపెడుతున్నట్టు ఎక్కడ ప్రకటించలేదు.
ఈ 104 హెల్ప్ లైన్ నెంబర్ తో నడిచే వివిధ సేవల సమాచారం కోసం వెతకగా, GVK EMRI పలు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో “104 Health Advice Helpline Services” సేవలని అమలు చేస్తున్నట్టు తెలిసింది. వీటిలో తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలు 104 హెల్ప్ లైన్ నెంబర్ తో అమలు చేసే సేవలు
తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో 104 హెల్ప్ లైన్ నెంబర్ ని రూరల్ హెల్త్ సర్వీసులు కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల, ఈ నెంబర్ ని కరోన హెల్ప్ లైన్ నెంబర్ గా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించింది. ఈ 104 మెడికల్ హెల్ప్ లైన్ సర్వీసు డైరెక్టర్ అండ్ కమీషనర్ అఫ్ హెల్త్ డిపార్టుమెంటు కంట్రోల్ లో ఉంటుంది.
అస్సాం:
అస్సాం రాష్ట్రంలోని 104 సారథి అనేది ఆరోగ్య సలహాల కొరకు 24 గంటలు ఉచితంగా కాల్ చేసుకోగలిగే హెల్ప్ లైన్ సెంటర్. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వార ఆరోగ్య చికిత్స, కౌన్సిలింగ్ సర్వీసులు, డైరెక్టరీ సమాచారం మరియు కంప్లైంట్ రిజిస్ట్రీ కి సంబంధించిన సలహాలని అందిస్తారు.
రాజస్తాన్:
రాజస్తాన్ రాష్ట్రంలో 104 మెడికల్ సర్వీస్ ద్వార ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలకు సలహాలు కోరవచ్చు.
చివరగా, 104 హెల్ప్ లైన్ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సేవలని మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోంది.