కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో (2011-14) ఉన్న LPG గ్యాస్ సిలిండర్ల ధరలని, బీజేపి ప్రభుత్వం అందిస్తున్న LPG సిలిండర్ల యొక్క ధరలని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. 2011 నుండి 2021 సమయంలో ఉన్న LPG సిలిండర్ల ధరలని ఈ పోస్టులో షేర్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న LPG గ్యాస్ సిలిండర్ల ధరల కంటే బీజేపీ ప్రభుత్వం చాలా తక్కువ ధరలలో LPG సిలిండర్లని అందిస్తుందనేది ఈ పోస్ట్ సారాంశం. అంతేకాదు, లాక్ డౌన్ సమయంలో బీజేపీ ప్రభుత్వం 24 కోట్ల ఉచిత LPG సిలిండర్లని ఉజ్వల వినియోగుదరులకు అందించినట్టు ఈ పోస్టు తెలిపింది. ఇటివల వరుసుగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వంలో (2011-2014) ఉన్న LPG గ్యాస్ సిలిండర్ల ధరల కంటే బీజేపి ప్రభుత్వం చాలా తక్కువ ధరలలో ప్రజలకి LPG సిలిండర్లని అందిస్తుంది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలిపిన LPG గ్యాస్ సిలిండర్ల ధరలు ‘Non-subsidised 14Kg Indane Gas’ (Delhi) కి సంబంధించినవి. కాని, ఈ ధరలలో కొన్ని అసమానతలు ఉన్నాయి. LPG గ్యాస్ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ FOB ధరల మీద ఆధారపడి ఉంటాయి. 2013, 2014 సంవత్సరాలలో LPG సిలిండర్ల ధరలు పెరగడానికి ముఖ్య కారణం, ఆ సంవత్సరాలలో పెరిగిన అంతర్జాతీయ FOB ధరలు. ఈ పోస్టులో అంతర్జాతీయ FOB ధరల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో తెలిపిన LPG ధరల వివరాల కోసం గూగుల్ లో వెతికితే, ఈ ధరలు ‘Non-subsidised 14Kg Indane Gas’ (Delhi) కి సంబంధించినవని తెలిసింది. డిసెంబర్ 2013 నుండి ఫిబ్రవరి 2021 (ఢిల్లీ) వరకు తెలిపిన LPG సిలిండర్ల ధరలని, ‘Indian Oil’ వెబ్సైటులో చూడవచ్చు. కాని, పోస్టులో తెలిపిన ఈ LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో కొన్ని అసమానతలు ఉన్నాయి. ఈ జాబితా లోని LPG సిలిండర్ల ధరలు 2019, 2017, 2016, 2015 సంవత్సరాలలో డిసెంబర్ నేలను రిఫరెన్స్ గా తీసుకుంటే, 2014 సంవత్సరంలో మాత్రం జనవరి నెల రిఫరెన్స్ గా తీసుకొని LPG ధరలు తెలిపింది. 2014 సంవత్సరంలో LPG సిలిండర్ల ధర జనవరిలో 1241 రూపాయిలు ఉంటే, డిసెంబర్ నెలలో 752 రూపాయిలకు తగ్గింది. అంతేకాదు, డిసెంబర్ 2018 లో LPG గ్యాస్ సిలిండర్ల ధర 809.50 రూపాయిలు, 609 రూపాయిలు కాదు.
Petroleum Planning & Analysis Cell (PPAC) పబ్లిష్ చేసిన ‘Ready Reckoner’ (జూన్ 2018) డాక్యుమెంట్ లో, LPG గ్యాస్ సిలిండర్ల ధరలు అనేక వాటి మీద ఆధారపడి ఉంటాయని చూడొచ్చు. LPG సిలిండర్ల ధర అంతర్జాతీయ FOB (Free On Board) ధరల మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుందని డాక్యుమెంట్ లో వివరించారు. LPG పై FOB ధరలు అనేది గత మాసంలో Saudi Aramco కంపెనీ, బ్యూటేన్ (60%) మరియు ప్రొపేన్ (40%) చమరుల పై విధించిన కాంట్రాక్ట్ ధరలని వెయిటేడ్ ఆవెరెజ్ చేస్తే వస్తుంది. అంతేకాదు, గత మాసంలో Platts Gaswire పబ్లిష్ చేసిన ప్రీమియం/ డిస్కౌంట్ ధరలని ఆవెరెజ్ చేసి ఈ FOB ధరలలో కలుపుతారు. 2018 లోక్ సభ సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం మరియు నాచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వ రాయితీ కలిగి ఉన్న వినియోగదారులకి LPG గ్యాస్ సిలిండర్లని సబ్సిడీ ధరలకే అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ రాయితీ లేని వారికి ఆయా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా LPG సిలిండర్ల ధరలు ప్రకటిస్తాయని మంత్రి తెలిపారు. దేశంలో LPG సిలిండర్ల ధర, అంతర్జాతీయ FOB ధరల పై ఆధారపడి ఉంటుందని మంత్రి స్పష్టంగా తెలిపారు.
2012-2021 మధ్య ఉన్న అంతర్జాతీయ FOB ధరలని Ready Reckoner డాక్యుమెంట్లలో (Nov-2014, Oct-2016, Nov-2017, Dec-2019, May-2020) మరియు PPAC పబ్లిష్ చేసిన హిస్టారికల్ ధరల జాబితాలో చూడవచ్చు. ఈ డాక్యుమెంట్లలోని FOB ధరలను గమనిస్తే, 2012-13 మరియు 2013-14 సంవత్సరాలలో అంతర్జాతీయ FOB ధరలు, NDA ప్రభుత్వ వచ్చాక ఉన్న FOB ధరలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిబట్టి, 2013 మరియు 2014లో LPG సిలిండర్ల ధరలు పెరగడానికి ముఖ్యకారణం, ఆ సంవత్సరాలలో పెరిగిన అంతర్జాతీయ FOB ధరలని చెప్పవచ్చు.
లాక్ డౌన్ సమయంలో భారత ప్రభుత్వం 8 కోట్ల ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) వినియోగదారులకి, తలా 3 సిలిండర్ల చొప్పున 24 కోట్ల ఉచిత LPG సిలిండర్లని అందచేస్తామని ప్రకటించింది. 31 డిసెంబర్ 2020 నాడు ‘PIB’ పబ్లిష్ చేసిన ప్రెస్ రిలీజ్ లో, భారత ప్రభుత్వం ఇప్పటివరకు 14.13 కోట్ల LPG సిలిండర్లని PMUY వినియోగదారులకి ఉచితంగా అందచేసినట్టు తెలిపారు.
చివరగా, అంతర్జాతీయ FOB ధరలని లెక్కలో తీసుకోకుండా పోస్ట్ చేసిన ఈ LPG సిలిండర్ల జాబితా ప్రజలని తప్పుదోవ పట్టిస్తుంది.