Fake News, Telugu
 

జూన్ 2022లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనకు సంబంధించిన వీడియోను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు

0

“ట్రైన్/రైలుని తగలబెడుతున్న ముస్లింలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలు రైలుకు నిప్పు పెడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో17 జూన్ 2022న తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు చేసిన నిరసనకు సంబంధించింది. 24 జూన్ 2022న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వారి అధికారిక X(ట్విట్టర్)లో వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను సంతోష్, పృథ్వీగా గుర్తించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని (ఆర్కైవ్డ్) ‘ रेलवे सुरक्षा बल RPF (రైల్వే సురక్ష బల్ RPF)’ అనే ఫేస్‌బుక్ పేజీ 25 జూన్  2022న షేర్ చేసినట్లు కనుగొన్నాము. దీన్ని బట్టి ఈ వీడియో ఇటీవలిది కాదని మనం నిర్ధారించవచ్చు. ఈ వీడియో వివరణలో, ఈ వీడియో 17 జూన్ 2022న సికింద్రాబాద్ స్టేషన్‌లో చిత్రీకరించబడిందని, ఈ వీడియోలోని వ్యక్తులను సంతోష్, పృథ్వీగా గుర్తించారని పేర్కొన్నారు. అలాగే, GRP, RPF పోలీసులు IPC, PDPP చట్టం మరియు రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్ కేసుల్లో వారితో సహా 60 మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు.

దీని ఆధారంగా ఈ ఘటన/వీడియోకు సంబంధించిన మరిత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 23 జూన్ 2022న ‘హిందుస్థాన్ టైమ్స్’ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారమైన వీడియో కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, 17 జూన్ 2022న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు చేసిన నిరసనను వీడియో చూపిస్తుంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిందని, కొంతమంది నిరసనకారులు స్టేషన్‌లో గందరగోళం సృష్టించారని, స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని, ప్లాట్‌ఫారమ్‌లపై నిలిపి ఉంచిన మూడు రైళ్లకు నిప్పు పెట్టారని ఈ కథనం పేర్కొంది. అలాగే, ఈ వీడియోలో, రైలు సీట్ల మధ్య కార్డ్‌బోర్డ్ పెట్టి రైలుకు నిప్పు పెడుతున్న పృథ్వీరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని ఆ కథనం పేర్కొంది.

ఈ క్రమంలోనే వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ జూన్ 2022లో ప్రచురించబడిన పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ వార్త కథనాలలో కొన్ని ఈ వైరల్ వీడియోపై 24 జూన్ 2022న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వారి అధికారిక X(ట్విట్టర్)లో చేసిన పోస్ట్ షేర్ చేశాయి. ఈ పోస్ట్‌లో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను సంతోష్, పృథ్వీగా గుర్తించింది.

17 జూన్ 2022న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనకు సంబంధించిన మరిన్ని వార్తలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. రిపోర్ట్స్ (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, 17 జూన్ 2022న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన నిరసన సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో ఆదిలాబాద్‌కు చెందిన పృద్విరాజ్‌ను A2గా, సంతోష్‌ను A5గా పేర్కొన్నారు. అలాగే సికింద్రాబాద్ గోపాలపురం L&O పోలీసులు కూడా మరో రెండు కేసులు నమోదు చేశారు (223/2022, 222/2022).

రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో A2గా పృద్విరాజ్‌కు 28 జూలై 2022న, A5గా ఉన్న సంతోష్‌కు 01 ఆగస్ట్ 2022లో బెయిల్ లభించింది. ఈ కేసుల విచారణ ఇంకా కోర్టులో కొనసాగుతోంది.

చివరగా, జూన్ 2022లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు చేసిన నిరసనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు మతపరమైన కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll