యునైటెడ్ కింగ్‌డమ్ (UK) రాజు, కింగ్ చార్లెస్ III ఒక హాస్పిటల్ కారిడార్‌లోని ట్రాలీపై ఉన్న గ్రాఫిక్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల కింగ్ చార్లెస్ కు క్యాన్సర్ వ్యాధి ఉంది అని పరీక్షల్లో నిర్ధారించబడింది అని బకింగ్‌హాం ప్యాలస్ వెల్లడించిన తరుణంలో, చికిత్స పొందేందుకు ఆసుపత్రి కారిడార్‌లో 24 గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని క్లెయిమ్ చేస్తూ ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాల్ని పరిశీలిద్దాం.
క్లెయిమ్: కింగ్ చార్లెస్ III ఇటీవల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 24 గంటల పాటు ఆసుపత్రి కారిడార్‌లో వేచి ఉండాల్సి వచ్చింది.
ఫాక్ట్(నిజం): ఈ క్లెయిమ్ యొక్క విశ్వసనీయతని ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ‘న్యూస్ థంప్’ అనే ఒక బ్రిటీష్ వెబ్‌సైట్, వైరల్ ఫొటోలో ఉన్న టైటిల్‌ని పోలిన హెడ్‌లైన్‌తో ఒక కథనాన్ని ప్రచురించింది, కానీ ఈ వెబ్సైట్ ఒక సెటైరికల్, అంటే వ్యంగ్య, కల్పిత కథనాల్ని ప్రచురించే వెబ్సైట్, ఇది నిజం న్యూస్ కాదు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ క్లెయిమ్‌లో చెప్తున్నట్టు కింగ్ చార్లెస్ III తన చికిత్స కోసం హాస్పిటల్ కారిడార్‌లో 24 గంటలపాటు వేచి ఉన్నారు అనే క్లెయిమ్‌ని వెరిఫై చేయడానికి ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసాము. కానీ ఈ క్లెయిమ్‌ని నిర్ధారిస్తూ మాకు ఎటువంటి విశ్వసనీయమైన వార్తా కథనాలు లేదా నివేదికలు దొరకలేదు.
తర్వాత, మా సెర్చ్‌లో స్పూఫ్ కథనాల్ని ప్రచురించే ‘న్యూస్ థంప్’ అనే వ్యంగ్య వార్తల వెబ్‌సైట్ ప్రచురించిన ఒక కథనం దొరికింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యిన గ్రాఫిక్‌లో ఉన్న హెడ్‌లైన్ మరియు ఫోటో ఈ ‘న్యూస్ థంప్’ కథనంలోనూ ఉన్నాయి.
వారి ‘x’ హ్యాండిల్‌పై ‘న్యూస్ థంప్’ బయోలో వీరు సెటైర్ (వ్యంగ్య, కల్పిత) వార్తా కథనాలు రాస్తారు అనే వాదనకి ఆధారంగా ‘Former blue check. Topical satire from the UK and around the world. You’re not supposed to believe what we write, you idiot. ‘ అని ఉంది.
‘న్యూస్ థంప్’ వాస్తవ వార్తలకు మూలం కాదని, వ్యంగ్య, కల్పిత కథనాలని ప్రచురిస్తుంది అని వీరి ట్విట్టర్ బయో స్పష్టం చేస్తుంది. వ్యంగ్య కథనాన్ని తప్పుగా అన్వయించి నిజమైన వార్తగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
కింగ్ చార్లెస్ III ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తూ, బకింగ్‌హామ్ ప్యాలెస్ 5 ఫిబ్రవరి 2024న ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం, కింగ్ చార్లెస్ III ఇటీవల ప్రోస్టేట్ చికిత్స పొందుతున్నప్పుడు తను క్యాన్సర్‌తో కూడా బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు అని చెప్పారు.
అతను ప్రస్తుతం తన మొదటి రౌండ్ క్యాన్సర్ చికిత్స పొందిన తరువాత తన ప్రైవేట్ ఎస్టేట్, సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో కోలుకుంటున్నాడు.
చివరిగా, కింగ్ చార్లెస్ III తన చికిత్స కోసం 24 గంటల పాటు ఆసుపత్రి కారిడార్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని విస్తృతంగా షేర్ చేసిన పోస్ట్ తప్పు. ఈ కథ ఒక వ్యంగ్య, కల్పిత కథనం నుండి ఉద్భవించింది, నిజమైన వార్త కాదు.