‘హిట్లర్ యూదులను బట్టలూడదీసి కంటైనర్ లో కుక్కి టీయర్ గ్యాస్ ప్రయోగించి క్రూరాతి క్రూరంగ దారుణంగా చంపాడో చూడండి..! వాళ్ళను క్యాంపులలో పెట్టి ఆహారం ఇవ్వకుండా ఎలా హింసించాడో దుర్మార్గుడు‘ అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వెనుక నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: హిట్లర్ యూదులను బట్టలూడదీసి కంటైనర్ లో కుక్కి టీయర్ గ్యాస్ ప్రయోగించి దారుణంగా చంపుతున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో చివర చూపించిన దృశ్యాలు హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులవే అయినప్పటికీ, వీడియో మొదట్లో బట్టలు లేకుండా కంటైనర్లో మనుషులను పంపుతున్న దృశ్యం 1991లో రాయ్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన Härlig er jorden అనే ఒక స్వీడిష్ షార్ట్ ఫిల్మ్ లోనిది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
హిట్లర్ యొక్క కాన్సంట్రేషన్ క్యాంపులు రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన హోలోకాస్ట్ అనబడే మారణహోమంలో ప్రధాన భాగం. మైనారిటీ సమూహాలను, ప్రధానంగా యూదులను (Jews) నిర్బంధించడానికి, క్రమపద్ధతిలో హింసించడానికి నాజీలు ఈ క్యాంపులను స్థాపించారు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేమ్ల ఆధారంగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వీడియోలో చివరి కొన్ని దృశ్యాలు హిట్లర్ స్థాపించిన కాన్సంట్రేషన్ క్యాంపులకు సంబంధించినవే అయినప్పటికీ (ఇక్కడ మరియు ఇక్కడ), పోస్టులో బట్టలు లేకుండా కంటైనర్లోకి మనుషులను పంపుతున్న దృశ్యం Härlig er jorden అనే ఒక స్వీడిష్ షార్ట్ ఫిలింలోని ఒక సన్నివేశం అని YouTube వీడియో ద్వారా తెలిసింది.
Härlig er jorden (ఇక్కడ మరియు ఇక్కడ) అనేది ఒక స్వీడిష్ లఘు చిత్రం. ఇది 1991లో రాయ్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు మరియు Klas-Gösta Olsson నటించారు. ఈ చిత్రం ఒక తెల్లటి మేకప్‌లో ఉన్న వ్యక్తి యొక్క కథను చెబుతుంది, అతను తన జీవితం, అతని చీకటి, శైలీకృత ప్రపంచం గుండా వీక్షకుడిని తీసుకెళ్తాడు.
చివరిగా, 1991లోని ఒక స్వీడిష్ షార్ట్ ఫిల్మ్ లోని సన్నివేశాన్ని హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులకు సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.