అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కోసం కదిలి వచ్చిన వానర సైన్యం (కోతుల గుంపు) అని చెప్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కోసం కదిలి వచ్చిన వానర సైన్యం (కోతుల సమూహం) వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో మార్చి 2020 థాయ్‌లాండ్‌లో రిపోర్ట్ అయింది. ఈ వీడియోకి అయోధ్యకి ఎటువంటి సంబంధంలేదు. మార్చి 2020లో కరోనా కారణంగా సరిపడా ఆహారం దొరక్క థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి నగరంలో కోతుల మధ్య జరిగిన దాడికి సంబంధించిన వీడియోను అయోధ్యకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకు సంబంధించి సమాచారం కోసం, ముందుగా వీడియో స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోలోని దృశ్యాలను మార్చి 2020లో రిపోర్ట్ చేసిన పలు థాయ్‌లాండ్ వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈ వీడియో థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి పట్టణానికి సంబంధిచింది, ఈ నగరంలో కోతులు అధిక సంఖ్యలో ఉంటాయి. గతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోతులకు ఆహారం ఇచ్చేవారు. కానీ 2020లో కరోనా కారణంగా ఈ నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పడిపోయింది, ఈ నేపథ్యంలోనే సరిపడా ఆహారం దొరకని కారణంగా కోతులు రెండు వర్గాలగా ఏర్పడి విధిలో పోట్లాడుకున్నాయి.
రెండు వీడియోలను జాగ్రత్తగా గమనించి, వైరల్ వీడియో, ఇంకా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ గ్రాబ్‌లను పోల్చడం ద్వారా రెండూ ఒకటే అని నిర్ధారించవచ్చు.
చివరగా, సంబంధం లేని థాయ్‌లాండ్ కోతుల గుంపు వీడియోను అయోధ్యకు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.