Fake News, Telugu
 

2019లో జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించిన వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ 23 ఏప్రిల్ 2024న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో ఈ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజాలేమిటో తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 03 నవంబర్ 2019న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఆంధ్ర ప్రదేశ్లో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా జనసేన పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను 04 నవంబర్ 2019న జనసేన పార్టీ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో “Aerial View | JanaSena Party Long March at Visakhapatnam Against YSRCP Sand Policy | Pawan Kalyan” అనే శీర్షికతో పబ్లిష్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియో 03 నవంబర్ 2019న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఏపీలో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా జనసేన పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించినదిగా తెలిసింది. ఈ జనసేన మార్చ్‌ను రిపోర్ట్ చేసిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని దృశ్యాలను, 2019లో జనసేన పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ దృశ్యాలతో పోల్చి చూస్తే, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ జనసేన లాంగ్ మార్చ్‌కు సంబంధించినవిగా మనం నిర్ధారించవచ్చు.

చివరగా, 2019లో జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించిన వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll