Fake News, Telugu
 

నిర్దోషిగా విడుదలైన వ్యక్తి ఫోటోకు సంబంధంలేని తీవ్రవాద వ్యాఖ్యలు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

“హిందువులు, బుద్ధులు, క్రిస్టియన్స్ అందరూ చచ్చే దాకా జిహాద్ కొనసాగుతుంది. మీ సహనం, లౌకికం మా సిద్ధాంతాలను మార్చలేవు. అల్లా యొక్క ముస్లింస్ తప్ప ఎవరూ బతకడానికి అనుమతి ఇవ్వలేదు” అనే వ్యాఖ్యలు అబ్దుల్లా జుబిర్‌ అనే వ్యక్తికి ఆపాదిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంతోంది. ఈ పోస్టులో ఒక ముస్లిం వ్యక్తి ఫోటోను కూడా షేర్ చేసారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “హిందువులు, బుద్ధులు, క్రిస్టియన్స్ అందరూ చచ్చే దాకా జిహాద్ కొనసాగుతుంది. మీ సహనం, లౌకికం మా సిద్ధాంతాలను మార్చలేవు. అల్లా యొక్క ముస్లింస్ తప్ప ఎవరూ బతకడానికి అనుమతి ఇవ్వలేదు” – అబ్దుల్లా జుబిర్‌

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలో ఉన వ్యక్తి పేరు అబ్దుల్లా జుబెర్ అనేది నిజమే అయినా, అతను ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఇతను 2006లో తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్ట్ కాగా, 2014లో కోల్‌కతాలోని కోర్టు ఇతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో ఉన్న ముస్లిం వ్యక్తి ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా TwoCircles.net అనే వెబ్సైటు ఈ వ్యక్తి ఫోటోను 2014లో ప్రచురించిన ఒక కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం అబ్దుల్లా జుబెర్, నూర్ అహ్మద్ మరియు తారిక్ అఖ్తర్ అనే ముగ్గురు వ్యక్తులను 2006లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మరియు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కింద అరెస్ట్ చేసారు.

ఐతే ఎనిమిదేళ్ళ విచారణ అనంతరం వీళ్ళు ముగ్గురు నిర్దోషులని తెలుస్తూ 2014లో కోల్‌కతాలోని కోర్టు వీరిని విడుదల చేసింది. వైరల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఫోటోను ఈ కథనం నుండే సేకరించారు. పోస్టులో చెప్తున్నట్టు ఈ వ్యక్తి పేరు అబ్దుల్లా జుబెర్ అనేది నిజమే, ఇతను బీహార్‌లోని హాజీపూర్ ప్రాంతానికి చెందిన వాడు.

ఐతే వైరల్ పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు అబ్దుల్లా జుబెర్ అన్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ ఐతే మాకు లభించలేదు. పైగా TwoCircles.net ఇదే అంశానికి సంబంధించి 2017లో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం తమ సంస్థ 2014లో తీసిన అబ్దుల్లా జుబెర్ ఫోటోకు సంబంధంలేని వ్యాఖ్యలు జోడిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారన్నది సారాంశం.

గతంలో 2019లో న్యూజిలాండ్ మసీదు కాల్పులు జరిగినప్పుడు కూడా ఇదే ఫోటోతో సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఆ కాల్పులు జరిపింది అబ్దుల్లా జుబెర్ అంటూ, కాల్పుల తరవాత BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ వ్యాఖ్యలు చేశాడంటూ షేర్ చేసారు. అప్పుడు AFP సంస్థ TwoCirclesతో సంప్రదించి ఈ వార్త తప్పని నిర్దారిస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

వీటన్నిటిబట్టి, తీవ్రవాద ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికి వచ్చిన వ్యక్తి ఫొటోకు సంబంధంలేని వ్యాఖ్యలు ఆపాధించినట్టు అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, నిర్దోషిగా విడుదలైన వ్యక్తి ఫోటోకు సంబంధంలేని తీవ్రవాద వ్యాఖ్యలు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll