Fake News, Telugu
 

హైదరాబాద్‌లోని రోహింగ్యాలకు సంబంధించి అవాస్తవాలతో కూడిన పాత కథనాన్ని ఇప్పుడు షేర్ చేస్తున్నారు

0

రాచకొండలో 4,835 మంది రోహింగ్యాలు ఉన్నారని, వారిలో 4,561 మందికి ఫేక్ ఆధార్, ఓటర్ ఐడీలు ఉన్నాయని సీపీ మహేష్ భగవత్ వెల్లడించినట్టు రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ క్లిప్‌ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాచకొండలో 4,835 మంది రోహింగ్యాలు ఉన్నారని, వారిలో 4,561 మందికి ఫేక్ ఆధార్, ఓటర్ ఐడీలు- న్యూస్ క్లిప్.

ఫాక్ట్ (నిజం): ఈ కథనం ఇప్పటిది కాదు, గత సంవత్సరం, 2020 నవంబర్‌లో ఇది ప్రచురించబడింది. ఐతే ఈ కథనంలో తప్పుడు వివరాలు ప్రచురించారంటూ సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ సరైన వివరాలను ట్వీట్ ద్వారా షేర్ చేసారు. ఈ వివరాల ప్రకారం హైదరాబాద్‌లో మొత్తం 4,835 మంది రోహింగ్యాలు ఉండగా, ఇందులో 4,561 మంది బయోమెట్రిక్ వివరాల సేకరణ పూర్తికాగా, ఇంకా 274 మంది వివరాల సేకరణ పెండింగ్ ఉంది. ఐతే వైరల్ కథనంలో బయోమెట్రిక్ వివరాల సేకరణ పూర్తయిన సంఖ్యను, 4561 మందికి ఫేక్ ఐడీలు ఉన్నట్టు తప్పుగా వక్రీకరించి రాసినట్టు కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వార్త ఇప్పటిది కాదు.  28 నవంబర్ 2020లో వెలుగు దిన పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. రాచకొండ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 4,835 మంది రోహింగ్యాలు ఉన్నట్లు, బయోమెట్రిక్, ఐరిస్ చెకింగ్‌‌‌‌ ద్వారా ఇందులో 4,561 మందికి ఫేక్ ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉన్నట్లు గుర్తించామని సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ వెల్లడించినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు.

ఐతే వెలుగు పత్రిక తమ కథనంలో హైదరాబాద్‌లోని రోహింగ్యాలకు సంబంధించి తప్పుడు వివరాలు ప్రచురించిందని చెప్తూ సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ 28 నవంబర్ 2020న ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ ద్వారా సీపీ రోహింగ్యాలకు సంబంధించి సరైన వివరాలు షేర్ చేసారు.

ఈ వివరాల ప్రకారం హైదరాబాద్‌లో మొత్తం 4,835 మంది రోహింగ్యాలు ఉండగా, ఇందులో 4,561 మంది బయోమెట్రిక్ వివరాల సేకరణ పూర్తకాగా, ఇంకా 274 మంది వివరాల సేకరణ పెండింగ్ ఉంది.

రోహింగ్యాలపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాల ప్రకారం రోహింగ్యాలపై మొత్తం 65 కేసులు నమోదుకాగా, 135 మంది రోహింగ్యాలను అరెస్ట్ చేసారు. ఇందులో అక్రమంగా ఆధార్ కార్డు సేకరించిన కారణంగా 24 కేసులు నమోదు కాగా, వీరినుండి 42 ఆధార్ కార్డులను సీజ్ చేసారు. అదేవిధంగా అక్రమంగా ఓటర్ ఐడీలు సేకరించిన కారణంగా 15 కేసులు నమోదు కాగా, వీరినుండి 24 ఓటర్ ఐడీలు సీజ్ చేసారు. అలాగే అక్రమ  డ్రైవింగ్ లైసెన్సు, PAN కార్డు, పాస్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ మరియు బ్యాంకు ఎకౌంటుల సేకరించినందుకు కూడా పలు కేసులు నమోదైనట్టు ఈ వివరాలలో పేర్కొన్నారు.

ఐతే ఈ వివరాల బట్టి వైరల్ అయిన న్యూస్ క్లిప్‌లో బయోమెట్రిక్ వివరాలు సేకరణ పూర్తయిన వివరాలను, 4561 మందికి ఫేక్ ఐడీలు ఉన్నట్టు తప్పుగా రాసినట్టు అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, హైదరాబాద్‌లోని రోహింగ్యాలకు సంబంధించి అవాస్తవాలతో కూడిన పాత కథనాన్ని మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll