Fake News, Telugu
 

ముస్లిం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోని ముస్లిం భర్త తన హిందూ భార్యని కొడుతున్నాడని షేర్ చేస్తున్నారు

0

తన కొడుకు పుట్టినరోజు వేడుకలో హిందూ సంప్రదాయం ప్రకారం కొవ్వొత్తులు వెలిగిస్తుందని ఒక ముస్లిం భర్త తన హిందూ భార్యను కొడుతున్నాడని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: తన కొడుకు పుట్టినరోజు వేడుకలో హిందూ సంప్రదాయం ప్రకారం కొవ్వొత్తులు వెలిగిస్తుందని ఒక ముస్లిం భర్త తన హిందూ భార్యను కొడుతున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో ఉన్న భార్యాభర్తల పేర్లు ‘మహ్మద్ ముస్తాక్’, ‘అయేషా భాను’. ముస్లిం మతానికి చెందిన వీరికి 2009లో వివాహం జరిగింది. 2015లో వీరిద్దరు తమ కొడుకు పుట్టినరోజును ఒక హోటల్‌లో జరుపుకుంటున్నప్పుడు, ముస్తాక్ కెమెరాను ఏర్పాటు చేస్తుండగానే అయేషా కేక్‌పై కొవ్వొత్తులను వెలిగించిందని కోపంతో అతడు అయేషాను దారుణంగా కొట్టాడు. అంతేకాక, ముస్తాక్ మరియు అతని కుటుంబ సభ్యులు అయేషాని వరకట్నం కోసం వేధించేవారు. ఇప్పుడు అయేషా, తన కొడుకుతో విడిగా వుంటూ విడాకుల కోసం ఎదురు చూస్తుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

వైరల్ వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోకి సంబంధించి అక్టోబర్ 2022లో ప్రచురించిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

పైన కథనాల్లో లభించిన సమాచారం ప్రకారం ఈ సంఘటన 2015లో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్మ ఈ ఇద్దరి పేర్లు ‘అయేషా భాను’, ‘మహ్మద్ ముస్తాక్’. బెంగుళూరుకి చెందిన వీరికి 2009లో వివాహం జరిగింది. ముస్తాక్ బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2013లో వారికి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు ‘షహ్రాన్’. ముస్తాక్ మరియు అతని కుటుంబం వరకట్నం కోసం అయేషాను వేధించేవారు. 2015లో, వీరిద్దరు తమ కొడుకు పుట్టినరోజును ఒక హోటల్‌లో జరుపుకుంటున్నప్పుడు, ముస్తాక్ కెమెరాను ఏర్పాటు చేస్తుండగానే అయేషా కేక్‌పై కొవ్వొత్తులను వెలిగించిందన్న కోపంతో అతడు అయేషాను దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన కెమెరాలో రికార్డయింది. అయేషా గత కొన్ని సంవత్సరాలనుండి భర్త నుండి విడిగా ఉంటోంది. తన భర్తపై గృహహింస కేసు పెట్టినా ఇప్పటి వరకు అతని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడిని కనీసం అరెస్ట్ కూడా చేయలేదని వివరించింది. అంతేకాక, ముస్తాక్ ఆయేషాకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించడమే కాక, మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ వీడియోలో అయేషా తనపై జరిగిన గృహహింస గురించి చెప్పడాన్ని చూడవచ్చు. 

2022లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ అయేషాకు తగిన న్యాయం జరగాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాసారు.

అంతేకాక, కర్ణాటక హై కోర్ట్ 2021లో ఇచ్చిన తీర్పులో తన భర్త రెండవ వివాహం కారణంగా ముస్లిం మతానికి చెందిన భార్య తన అత్తమామల నుండి విడిగా నివసిస్తూ వుంటే తన ఏకైక మైనర్ కొడుకుని ఆమె తన కస్టడీలోకి తీసుకోవచ్చని పేర్కొంది. అంతేకాక, అయేషా, ముస్తాక్ ఇద్దరూ ముస్లిం మతస్థులు అని ఆ తీర్పులో పేర్కొని ఉండడం గమనించవచ్చు. 

చివరగా, ఒక ముస్లిం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోని ముస్లిం భర్త తన హిందూ భార్యని కొడుతున్నాడని షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll