తాజాగా వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 1000 ఓట్ల లోపు తేడాతో 27 స్థానాల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్తూ సోషల్ మీడియా లో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఢిల్లీ ఎన్నికల్లో 1000 ఓట్ల లోపు తేడాతో బీజేపీ 27 స్థానాలు ఓడిపోయింది.
ఫాక్ట్ (నిజం): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 1000 ఓట్ల లోపు తేడాతో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. అందులో కూడా ఒక సీట్ ఆప్ గెలిచింది, మరొకటి బీజీపీ గెలిచింది. బీజేపీ 1000 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయింది ఒక్క సీట్ లో మాత్రమే. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
భారత ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ లో ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారనే సమాచారం దొరుకుతుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించి చూడగా కేవలం 2 సీట్లలో మాత్రమే 1000 ఓట్ల లోపు తేడాతో అభ్యర్థులు గెలిచినట్టుగా తెలుస్తుంది. ఆ రెండు సీట్లలో కూడా ఒక సీట్ ఆప్ గెలిచింది, మరొక సీట్ బీజేపీ గెలిచింది. లక్ష్మి నగర్ లో బీజేపీ గెలిస్తే, బిజ్వాసన్ లో ఆప్ గెలిచింది. అంతే కానీ పోస్టులో చెప్పినట్టు 1000 ఓట్ల లోపు తేడాతో బీజేపీ 27 స్థానాలు ఓడిపోయిందనేది అబద్ధం.
అంతే కాదు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే, మొత్తం 70 సీట్లకు గాను, 55 సీట్లలో అభ్యర్థులు 10,000 పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఒక 6 సీట్లలో 5000-10000 మధ్య ఓట్ల తేడాతో గెలిచారు. ఇంకా 1000-5000 మధ్య ఓట్ల తేడాతో 7 సీట్లలో అభ్యర్థులు గెలిచారు. పైన చెప్పినట్టు, కేవలం రెండు సీట్లలో మాత్రమే 1000 కంటే తక్కువ ఓట్లతో అభ్యర్థులు గెలిచారు.
చివరగా, ఢిల్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలో 1000 ఓట్ల లోపు తేడాతో బీజేపీ ఓడిపోయింది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?