Fake News, Telugu
 

‘15వ దలైలామాగా పుట్టపర్తి సత్యసాయి విద్యార్థి’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

15వ దలైలామాగా భారతీయుడినే ఎంపిక చేసిన ప్రస్తుత 14వ దలైలామా అంటూ ఫేస్బుక్ లో కొందరు ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): 15వ దలైలామాగా పుట్టపర్తి సత్యసాయి విద్యార్థి దావా వంగ్డి ని ఎంపిక చేసిన ప్రస్తుత 14వ దలైలామా.

ఫాక్ట్ (నిజం): 15వ దలైలామాగా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని 14వ దలైలామా ఆఫీసువారు FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లోచెప్పింది అబద్ధం.  

15వ దలైలామాగా భారతీయ విద్యార్థి దావా వంగ్డి ఎంపిక అయినట్టు సోషల్ మీడియా లో పోస్ట్ లే కాదు, వివిధ ప్రముఖ వార్తాపత్రికలు కూడా ప్రచురించినట్టు చూడొచ్చు. (ఈనాడు, సాక్షి, 10టీవీ, టీవీ5, టీవీ9, మైక్ టీవీ)

పోస్ట్ లోని విషయం గురించి కేవలం ఇరు రాష్ట్రాలలోని తెలుగు వార్త పత్రికలు మాత్రమే ప్రచురించాయి. 15వ దలైలామా ఎంపిక అయినట్టుగా మిగితా వార్తాపత్రికల్లో ఎక్కడ కూడా దొరకలేదు. కావున 15వ దలైలామా ఎంపిక మరియు ఫోటోలోని అబ్బాయి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఫోటో లోని అబ్బాయి ఎవరు?

ఫోటోలోని అబ్బాయి పేరు దావా వంగ్డి (పోస్టుల్లో కూడా ఇదే పేరు ఉంటుంది). వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్‌ కి చెందిన ప్రేమవంగ్డి మరియు పంజూరాయ్‌ ల కుమారుడు. 2016 లో దావా వంగ్డి ని ‘ద్రాక్త్సే రిన్పోచే’ అనే బౌద్ధ గురువు యొక్క అవతారం (మళ్ళీ పుట్టడం) అని 14వ దలైలామా గుర్తించినట్టు ‘జీ న్యూస్’ ఆర్టికల్ లో చూడవచ్చు. టిబెట్ బౌద్ధ మతంలో బౌద్ధ గురువులు చనిపోయాక మళ్ళీ ఇంకో అవతారంలో పుడుతారని నమ్మకం. కావున కేవలం దావా వంగ్డి నే కాకుండా ఇతరులను కూడా వివిధ  బౌద్ధ గురువుల అవతారాలుగా ఎన్నుకున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. దావా వంగ్డి ని ‘ద్రాక్త్సే రిన్పోచే’ అవతారం గా గుర్తించినట్టు వివిధ వార్తాపత్రికల్లో చదవచ్చు. కానీ తననే ఇప్పుడు 15వ దలైలామా గా ఎన్నుకున్నట్టు తెలుగు వార్తాపత్రికల్లో తప్ప ఎక్కడా కూడా సమాచారం లేదు.

15వ దలైలామా ఎంపిక: 14వ దలైలామా vs చైనా

చైనా ప్రభుత్వం వారు మాట్లాడుతూ 15వ దలైలామా ని చైనా లో నుండే ఎంపిక చేయాలని, భారత ప్రభుత్వం ఈ ప్రక్రియ లో కలగ చేసుకోవద్దని చెప్పినట్టు ‘The Hindu’ ఆర్టికల్ లో చదవచ్చు. అంతేకాదు, 15వ దలైలామా ఎంపిక కి చైనా ఆమోదం తప్పనిసరని తెలిపారు. 2011 లో 14వ దలైలామా మాట్లాడుతూ టిబెట్ ప్రజలు మరియు టిబెట్ బౌద్ధ మతం పాటించే ప్రజలు ఒకవేళ 15వ దలైలామా ఎన్నిక కోరుకుంటే, ఎంపిక ప్రక్రియ ను దలైలామా గాడెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్ కి చెందిన అధికారులకు అప్పగిస్తానని తెలిపినట్టు దలైలామా అధికారిక వెబ్ సైటులో చూడవచ్చు. అంతే కాదు, పునర్జన్మ మరియు అవతారాలను నమ్మని చైనా కమ్యూనిస్ట్లు దలైలామా ఎన్నిక ప్రక్రియలో కలగచేసుకోవడం సరికాదని తెలిపారు.

14వ దలైలామా 2019 మార్చి లో మాట్లాడుతూ తదుపరి దలైలామా భారతదేశం నుండి కూడా ఉండవచ్చని తెలిపరు. కానీ, ఇండియా నుండి ఒకరిని ఎంపిక చేసినట్టుగా ఎక్కడా కూడా తెలుపలేదు.

15వ దలైలామాగా దావా వంగ్డి  ఎంపిక జరిగిందా?

15వ దలైలామా ఎంపిక గురించి తెలుగు వార్తాపత్రికల్లో వచ్చిన విషయం గురించి దలైలామా ఆఫీసు వారికి FACTLY ఈ-మెయిల్ చేయగా, వారు ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. అలానే, పుట్టపర్తి సత్యసాయి స్కూలు వారికి కూడా FACTLY ఫోన్ చేయగా, వారి నుండి ఎటువంటి స్పందన లేదు.

చివరగా, ‘15వ దలైలామాగా పుట్టపర్తి సత్యసాయి విద్యార్థి’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15వ దలైలామాగా  ఇంకా ఎవరిని ఎన్నుకోలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll