గతంలో దుర్గాష్టమి పండగ సందర్భంగా బాలీవుడ్ నటి షబానా అజ్మీ హిందూ దేవతలను ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్‌కు కంగనా రనౌత్ ఘాటుగా ప్రతిస్పందించారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. షబానా అజ్మీ గతంలో దుర్గాష్టమి పండగ సందర్భంగా, “ఈ దుర్గాష్టమి నాడు ఏ దుర్గకు గర్భస్రావము కాకుండు గాకా! ఏ సరస్వతిని కూడా బడికి వెళ్ళనీయకుండా అడ్డుపడరు గాకా! ఏ లక్ష్మీ కూడా తన భర్త ముందు డబ్బు కోసం అడుక్కోకుండా ఉండుగాకా! ఏ పార్వతీ కూడా కట్నం కోసం బలికాకుండా ఉండుగాకా! ఏ కాళి కూడా ఫైయిర్సె క్రీమ్ వ్రాసుకోకుండా ఉండుగాకా!”, అని ట్వీట్ పెడితే కంగనా రనౌత్ దానికి స్పందిస్తూ, “ఈ ఈద్ (ముస్లింల పండుగ ) నాడు ఏ ఆయేషాకు ఆరేళ్ళ ముందే వివాహం జరగకుండు గాకా! ఏ షాబానోకు కూడా త్రిపుల్ తలాక్ జరగకుండు గాకా! ఏ మీనాకుమారీ కూడా హలాలా హింసకు గురికాకుండు గాకా! ఏ ఫాతిమా కూడా ఎవరికీ నాలుగో భార్యగా అవకుండా ఉండుగాకా! ఏ షీలా కు కూడా బలవంతంగా బురఖా తగిలించకుండా ఉండుగాకా! ఏ ఇష్రత్ కూడా టెర్రరిస్టుగా మార్చబడకుండా ఉండుగాకా! ఏ ముంతాజ్ కూడా 14 మంది పిల్లలను కనకుండా ఉండుగాకా”, అని ట్వీట్ పెట్టినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: షబానా అజ్మీ దుర్గాష్టమి పండగను ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్‌కు స్పందిస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలుపుతున్నట్టు 2017లో దుర్గాష్టమి పండగ సందర్భంగా హిందూ దేవతలను ఉద్దేశిస్తూ షబానా అజ్మీ ట్వీట్ పెట్టారు. అయితే, దుర్గాష్టమి పండగను ఉద్దేశిస్తూ షబానా అజ్మీ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఎప్పుడు స్పంధించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, పోస్టులో తెలుపుతున్నట్టు 2017లో దుర్గాష్టమి పండగ సందర్భంగా షబానా అజ్మీ హిందూ దేవతలను ఉద్దేశిస్తూ ట్వీట్ పెట్టారు.
షబానా అజ్మీ పెట్టిన ఈ ట్వీట్‌కు స్పంధిస్తూ కొందరు యూసర్లు, “ఈ మొహర్రం పండగ నాడు, ఏ హామీదాకు కూడా ట్రిపుల్ తలాక్ ఇవ్వకుండా ఉండాలని, ఏ సూకీనా కూడా బలవంతపు నిఖా హలాలా జరగకుండా ఉండాలని, ఏ ఫరీదా కూడా బలవంతంగా బురఖా ధరించే దుస్థితి కలగకూడదని ప్రార్ధిస్తున్నాము”, అని స్పందించారు. పోస్టులో కంగనా రనౌత్‌కు జత చేస్తున్న వ్యాఖ్యలు ఈ యూసర్లు చేసిన వ్యాఖ్యలతో పోలి ఉన్నాయి. అయితే, దుర్గాష్టమి పండగను ఉద్దేశిస్తూ షబానా అజ్మీ పెట్టిన ఈ ట్వీట్‌కు కంగనా రనౌత్ స్పందించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.
2019లో పుల్వామా దాడి తర్వాత కరాచీలో హాజరవ్వాలనుకున్న ఆర్ట్ కౌన్సిల్ కాన్ఫరెన్సును జావేద్ అక్తర్-షబానా అజ్మీ దంపతులు రద్దు చేసుకోవడానికి సంబంధించి కంగనా రనౌత్ స్పందించినట్టు తెలిసింది. యూరి ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించినప్పుడు, కరాచీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందుకు అంగీకారం తెలిపారని, సినిమా పరిశ్రమలో షబానా అజ్మీ లాంటి దేశ వ్యతిరేకులు చాలా మంది ఉన్నారని కంగనా రనౌత్ అప్పుడు స్పందించారు. కానీ, హిందూ దేవతలకు సంబంధించి షబానా అజ్మీ పెట్టిన ట్వీట్‌కు కంగనా రనౌత్ స్పందించలేదు.
2019లో నవరాత్రి పండగ సందర్భంగా షబానా అజ్మీ ఇవే వ్యాఖ్యలు మళ్ళీ చేసిందని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, అటువంటి వ్యాఖ్యలేవీ తాను చేయలేదని షబానా అజ్మీ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో కంగనా రనౌత్‌కు జత చేస్తున్న వ్యాఖ్యలు కంగనా రనౌత్ చేయలేదని, కంగనా రనౌత్ షబానా అజ్మీ పెట్టిన ట్వీట్‌కు స్పందించలేదని కంగనా రనౌత్ టీమ్ మీడియాకు స్పష్టం చేసింది.
చివరగా, దుర్గాష్టమికి సంబంధించి షబానా అజ్మీ పెట్టిన ట్వీట్‌కు కంగనా రనౌత్ ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలంటూ షేర్ చేస్తున్న ఈ పోస్ట్ తప్పు.