Fake News, Telugu
 

చేతి పంపు కింద నీళ్ళు తాగుతున్న ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందుది

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక చేతి పంపు వద్ద నీళ్ళు తాగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎందరో ముఖ్యమంత్రులు బిస్లరీ, హిమాలయా బాటిల్స్ అడిగి దాహం తీర్చుకోవడం మీరు చూసి ఉంటారు కానీ ఇలా చేతి పంపు కింద నీళ్ళు తాగే ముఖ్యమంత్రిని చూసి ఉండరు అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక చేతి పంపు వద్ద నీళ్ళు తాగుతున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): చేతి పంపు వద్ద నీళ్ళు తాగుతున్న ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. పైగా యోగి ఆదిత్యనాథ్ హిమాలయ వాటర్ బాటిల్స్ వాడుతున్న చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.

యోగి ఆదిత్యనాథ్ చేతి పంపు వద్ద నీళ్ళు తాగుతున్న ఈ ఫోటో ఏ సందర్భంలో తీసిందో తెలియనప్పటికీ, ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ చేయగా, ఇదే ఫోటోను ఏప్రిల్ 2016లో సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు పోస్టులు మాకు కనిపించాయి. ఈ సోషల్ మీడియా పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది 19 మార్చ్ 2017న. దీన్నిబట్టి, ఈ ఫోటో యోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసింది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.

యోగి ఆదిత్యనాథ్ కూడా హిమాలయ వాటర్ బాటిల్స్ వినియోగించాడు :

2017లో యోగి ఆదిత్యనాథ్ కొత్తగా ముఖ్యమంత్రి అయిన రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ హిమాలయ వాటర్ బాటిల్స్ ఉపయోగించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక మీటింగ్‌లో యోగి ముందు హిమాలయ వాటర్ బాటిల్స్, ఇతర అధికారుల ముందు బిస్లేరి బాటిల్స్ ఉన్న ఫోటో ఇక్కడ చూడొచ్చు.

యోగి ఆదిత్యనాథ్ హిమాలయ వాటర్ బాటిల్స్ వినియోగిస్తూ కనిపించే మరికొన్ని ఫోటోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

దీన్నిబట్టి పోస్టులో చేస్తున్న వాదనకు వ్యతిరేకంగా యోగి ఆదిత్యనాథ్ కూడా బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ వాడుతున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, చేతి పంపు కింద నీళ్ళు తాగుతున్న ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందుది. యోగి ఆదిత్యనాథ్ కూడా బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ వినియోగిస్తున్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll