Fake News, Telugu
 

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల గురించి సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పును ఇవ్వలేదు.

0

డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వేసిన అన్ని రకాల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది అంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వేసిన అన్ని రకాల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఫాక్ట్(నిజం):  ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇంకా ఇవ్వలేదు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ట్యాగ్ చేస్తూ తీర్పును పెండింగ్‌లో ఉంచింది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆర్టికల్స్ ద్వారా (ఇక్కడ మరియు ఇక్కడ) ఈ కేసును 27 సెప్టెంబర్ 2023న సుప్రీంకోర్టులో వాదనలకు వచ్చింది అని తెలిసింది. అయితే, ఈ కేసు స్టేటస్ ఇంకా పెండింగ్‌లో ఉంది, ఫైనల్ తీర్పు సుప్రీంకోర్టు ఇంకా ఇవ్వలేదు.

సుప్రీంకోర్టు తీర్పు గురించి మరింత పరిశీలించగా, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని జస్టిస్ బేల ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఎటువంటి నోటీసు ఇవ్వలేదు కానీ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ట్యాగ్ చేసారు అని తెలిసింది.

లీగల్ ప్రొసీడింగ్‌ల సందర్భంలో, “ప్లీను ట్యాగ్ చేయడం” అంటే కోర్టు ఒక చట్టపరమైన అభ్యర్థన లేదా పిటిషన్‌ను దానికి సంబంధిత పిటిషన్ లేదా కేసుతో లింక్ చేయడం అని అర్థం. రెండు లేదా అంతకంటే ఎక్కువ కేసులు లేదా పిటిషన్‌లు సాధారణ సమస్యలు, వాస్తవాలు లేదా చట్టపరమైన ప్రశ్నలను పంచుకున్నప్పుడు, చట్టపరమైన ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి వాటిని కలిపి “ట్యాగ్” చేయాలని కోర్టు నిర్ణయించవచ్చు.

చివరిగా, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యల గురించి సుప్రీంకోర్టుఇంకా తుది తీర్పును ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll