“పాతబస్తీలో పోలీసు అన్న పరిస్థితి ఇది”, అని చెప్తూ ఒక పోలీస్ అధికారి ఏడుస్తూ మాట్లాడుతున్న వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పాతబస్తీలో పోలీసులకే రక్షణ లేదు. తనపై దాడి చేయడంతో పోలీస్ అధికారి ఏడుస్తున్న వీడియో.
ఫాక్ట్: వీడియోలోనిది తాజాగా జరిగిన ఘటన కాదు; అది 2017లో జరిగింది. దాడి చేసిన వ్యక్తిపై 2017లోనే FIR నమోదు చేసారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తుంది. కావున, పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లోని వీడియో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అది ఒక పాత వీడియో అని తెలిసింది. “ఆసిఫ్‌నగర్ ఎస్ఐ వేంకటేశ్వర్లుపై మహ్మద్ సయ్యద్ అనే వ్యక్తి దాడి”, అని అదే వీడియోతో ‘టీవీ5 న్యూస్’ ఛానల్ వారు 2017లో పెట్టిన యూట్యూబ్ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
పాత వీడియో తాజాగా వైరల్ అవ్వడంతో ఆ ఘటనకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు పెట్టిన ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు. దాడి చేసిన వ్యక్తిపై 2017లోనే FIR నమోదు చేసారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తుంది. అయితే, వేరే ఘటనలపై తాజాగా ఏప్రిల్ నెలలో ‘ఈనాడు’ వార్తసంస్థ వారు “పాతబస్తీ విధులంటే సుస్తీ!”, అని రాసిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.
చివరగా, “పాతబస్తీలో పోలీసు అన్న పరిస్థితి ఇది”, అని పెట్టిన పోస్ట్‌లోని వీడియో 2017లో జరిగిన ఘటనకి సంబంధించినది.