Fake News, Telugu
 

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై లభ్యమైన యువతి మృతదేహం మతపరమైన (లవ్ జిహాద్) హత్య కాదు, ఢిల్లీలో జరిగిన పరువు హత్య

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలో యామీన్ ఖాన్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేసి చంపాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా మథుర యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై సూట్‌కేస్‌లో లభించిన బాలిక మృతదేహం ఫోటో జత చేసి షేర్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలో యామీన్ ఖాన్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేసి చంపాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మథుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సూట్‌కేస్‌లో లభించిన యువతి మృతదేహానిది. 17 నవంబర్ 2022న ఢిల్లీలో తన తండ్రి చేతిలో పరువుహత్యకు గురైన యువతిది. ఇదే విషయాన్ని 21 నవంబర్ 2022న మథుర పోలీసులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ పోస్టులో ఉన్న ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఇదే ఫొటోతో కూడిన ఒక యువతి మృతికి సంబంధించిన వార్తాకథనం లభించింది. ఈ కథనం ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే, ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి. ఈ కథనాల ప్రకారం “మృతురాలు తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమె కుటుంబం అసంతృప్తితో ఉంది, దీంతో కోపోద్రిక్తుడైన ఆమె తండ్రి ఆమెను తుపాకితో కాల్చి చంపి మృతదేహాన్ని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పడేశాడు”.

మరింత సమాచారం కోసం మధుర పోలీసుల X-హ్యాండిల్‌లో వెతకగా, ఇదే అంశం పై మథుర పోలీసులు 20 నవంబర్ 2022న ఒక వీడియో ప్రకటనను విడుదల చేసారు. చిత్రంలో ఉన్న యువతిని ఆమె సోదరుడు మరియు తల్లి గుర్తించినట్లు, బాధితురాలి కుటుంబం ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతానికి చెందినదిగా వారు తెలిపారు.

21 నవంబర్ 2022న మథుర పోలీసులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేసారు. ఈ ప్రకటన ప్రకారం “బాధితురాలి కుటుంబాన్ని విచారించగా, బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియకుండా ఛత్రపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు, బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళివచ్చేది, ఇది కుటుంబంలో ఉద్రిక్తతకు దారితీసింది మరియు ఫలితంగా, బాధితురాలి తండ్రి 17 నవంబర్ 2022న ఆమె చాతి పై తుపాకితో రెండుసార్లు కాల్చి చంపాడు, మృతదేహాన్ని రాత్రిపూట ఇంట్లోనే ఉంచి, తెల్లవారుజామున 3 గంటలకు మృతదేహాన్ని ఎరుపు రంగు సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి, ఆమె తల్లిదండ్రులు మథుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై మథుర సమీపంలో పడేశారు.”

మథుర పోలీసులు చెప్పిన సమచారం ప్రకారం యువతిని తన తండ్రే హత్య చేసాడు, అందుకు తల్లి సహకరించింది. యామీన్ ఖాన్ అనే వ్యక్తి ఆ యువతిని ప్రేమించి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేసి చంపినట్టు చెప్తున్నది ఒక కల్పిత కథనం.

చివరగా, యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సూట్‌కేస్‌లో లభించిన యువతి మృతదేహా౦ ఢిల్లీలో తండ్రి చేతిలో పరువుహత్యకు గురైన యువతిది.

Share.

About Author

Comments are closed.

scroll