Fake News, Telugu
 

ఈ వీడియోలో చిన్ననాటి టీచర్ చేత సరదాగా బెత్తంతో దెబ్బలు తింటున్న వ్యక్తి కలెక్టర్ కాదు

0

చిన్నప్పుడు చదువు నేర్పిన టీచర్ చేత మళ్ళీ బెత్తంతో దెబ్బలు తిని, ఆమె కాళ్ళకు నమస్కరిస్తూ తన సంస్కారాన్ని చాటుకున్న ఒక కలెక్టర్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చిన్నప్పుడు చదువు నేర్పిన టీచర్ చేత బెత్తంతో మళ్ళీ దెబ్బలు తిన్న కలెక్టర్ యొక్క వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో తన చిన్ననాటి టీచర్ చేత దెబ్బలు తింటున్న వ్యక్తి కేరళకు చెందిన జీజు జార్జ్ అని తెలిసింది. జీజు జార్జ్ అనే పేరుతో ఉన్న ఏ అభ్యర్ధి ఇప్పటివరకు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణులై కలెక్టర్‌గా నియామకం అవలేదు. జిజు జార్జ్ తాను కలెక్టర్ కాదని, కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమే అని, సోషల్ మీడియాలో తాను కలెక్టర్ అంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మాకు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న  క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని జీజు జార్జ్ అనే వ్యక్తి 17 మార్చి 2023 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. తన 10వ తరగతి టీచర్ చేత మళ్ళీ దెబ్బలు తింటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నానని జీజు జార్జ్ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు.

జీజు జార్జ్ ఫేస్‌బుక్ పేజీలోని చిత్రాలని వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలతో పోల్చి చూస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్నది జీజు జార్జ్‌ అని స్పష్టమయ్యింది. తమ 1984 పదవ తరగతి బ్యాచ్ విధ్యార్ధుల రీయూనియన్ వేడుక సందర్భంగా తమ హిందీ టీచర్‌తో మళ్ళీ బెత్తంతో దెబ్బలు తిని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని జీజు జార్జ్ కామెంట్ల కింద సమాధానమిచ్చారు.  

జీజు జార్జ్ పేరుతో ఐఏఎస్ అధికారి ఎవరైనా ప్రస్తుతం భాధ్యతలు చేపడుతున్నారా అని వెతికితే, ఇప్పటివరకు జీజు జార్జ్ పేరుతో ఏ ఒక్క వ్యక్తి ఐఏఎస్ అధికారిగా నియామకం కాలేదని ప్రభుత్వ అధికారిక వెబ్సైటులో సమాచారం ఆధారంగా స్పష్టమయ్యింది.

సోషల్ మీడియాలో తనని కలెక్టర్‌గా వర్ణిస్తూ షేర్ చేస్తున్న వీడియోపై స్పష్టత కోసం జీజు జార్జ్‌ని మేము సంప్రదించాము. జిజు జార్జ్ తాను కలెక్టర్ కాదని, కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమే అని, సోషల్ మీడియాలో తాను కలెక్టర్ అంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మాకు స్పష్టం చేశారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేస్తున్న వీడియోలో టీచర్ చేత దెబ్బలు తిన్న వ్యక్తి కలెక్టర్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ వీడియోలో తన చిన్ననాటి టీచర్ చేత దెబ్బలు తింటున్న వ్యక్తి కేరళకు చెందిన జీజు జార్జ్ అని తెలిసింది; అతను కలెక్టర్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll